25 ఏళ్ల తర్వాత అమేథీని వదులుకున్న గాంధీ కుటుంబం.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్

by Disha Web Desk 17 |
25 ఏళ్ల తర్వాత అమేథీని వదులుకున్న గాంధీ కుటుంబం.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ కంచుకోటలు అయినటువంటి ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలి స్థానాల అభ్యర్థులను తాజాగా ప్రకటించారు. రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి పట్టున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తుండగా, అమేథీ స్థానంలో 25 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా వారి పట్ల విధేయత కలిగి ఉన్నటువంటి కిషోరి లాల్ శర్మను బరిలోకి దింపారు.

ఈ నేపథ్యంలో అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం ఎక్స్‌లో ప్రశంసలు కురిపించారు. గాంధీ కుటుంబంతో శర్మకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది, తన విధి పట్ల ఆయనకున్న విధేయత, అంకితభావమే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాయని, అమేథీప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ హృదయపూర్వకంగా ముందు ఉంటారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న మక్కువ దానికి ఒక ఉదాహరణ. ఈ ఎన్నికల్లో శర్మ ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని ఆమె అన్నారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానం నుంచే రాహుల్ పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ ఆయన తన తల్లి సోనియా గాంధీకి పట్టున్నటువంటి రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారు. 1980లో మొదటిసారి సంజయ్ గాంధీ అమేథీ నుంచి గెలుపొందగా, ఆయన ఆకస్మిక మరణంతో రాజీవ్‌ గాంధీ పోటీ చేసి గెలవగా 1991 వరకు ఆ స్థానంలో రాజీవ్‌ కొనసాగారు.

ఆ తరువాత 1999లో సోనియా గాంధీ అమేథి నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందగా, 2004 లో ఆ స్థానం నుంచి రాహుల్ బరిలోకి దిగారు. 2009,2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందగా, 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కానీ అదే ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వాయనాడ్‌ నుంచీ కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో 25 ఏళ్ళ తరువాత గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తిని పోటీకి నిలబెట్టారు. ఏడు దశల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 20న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed