ఈటల వలనే బీజేపీ నాశనం.. విజయశాంతి పరోక్ష విమర్శలు

by Disha Web Desk 2 |
ఈటల వలనే బీజేపీ నాశనం.. విజయశాంతి పరోక్ష విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ నాటిన విత్తనం మొక్కగా మారి బీజేపీ పతనానికి కారణమైనదని మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌పై పరోక్షంగా విమర్శలు కురిపించారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి బీజేపీలో డౌన్ పాల్ మొదలైనదని, కీలక నేతలంతా పార్టీని వీడారన్నారు. అనేకసార్లు పార్టీ అధ్యక్షుడిని మార్చాలని బండి సంజయ్‌పై ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందాలు తర్వాత బండి సంజయ్‌ను మార్చేశారని విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

వివిధ కీలక నేతలు బీజేపీని వీడటానికి కూడా ఆయనే అని ఈటలను ఉద్దేశించి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి చేరిన తర్వాత ఆమె శనివారం మొదటిసారి గాంధీభవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. బీజేపీ తనను మోసం చేసిందన్నారు. కేసీఆర్ అవినీతిని వెలికి తీస్తామని చెబితేనే గతంలో బీజేపీలో చేరానని, కానీ ఇప్పుడు బీఆర్ ఎస్, బీజేపీ ఏకమయ్యాయని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ మౌనంగా ఉన్నదన్నారు.

అందుకే కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వస్తుందని, రాగానే కేసీఆర్ అంతు తేల్చుతామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లు ఉన్నదన్నారు. ఉద్యమ నాయకురాలుగా, పార్లమెంట్‌లో తెలంగాణ కోసం ఫైట్ చేసిన తనకు బీజేపీలో తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. 25 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

ఎన్నికల ముందు వద్దని వారించినా...

ఎన్నికల ముందు అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తొలగించవద్దని తాను నేతలందరితోనూ వారించానని, కానీ ఎవరూ తన మాట వినలేదన్నారు. పైగా తనకు ప్రయారిటీ ఇవ్వడం తగ్గించారన్నారు. కానీ తన లక్ష్యం కేసీఆర్ అవినీతిని అంతం చేయడం అని, మోడీపై నమ్మకంతో చివరి నిమిషం వరకు బీజేపీలో కొనసాగానన్నారు. కానీ నా నమ్మకంపై బీజేపీ నీళ్లు చల్లిందన్నారు. రెండు పార్టీ ఏకమై, ఉద్యమకారులు, నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను మోసం చేశారన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులు తెలంగాణకు వచ్చి ఇక్కడ అంతా అవినీతి జరిగిందని పదే పదే చెబుతున్నారని, అన్ని ప్రూఫ్‌లు ఉన్నా.. ఏమీ చేయలేకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టునే ఏటీఎం అని, వైట్ ఎలిఫెంట్ అని బీజేపీ నాయకులు అనేకసార్లు విమర్శించారని, కానీ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారన్నారు. దీంతో చేసేదేమీ లేక కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెట్టి, అవినీతిని అంతం చేసేందుకు కాంగ్రెస్‌లో చేరానన్నారు. పవర్‌లోకి రాగానే కేసీఆర్ అంతు చూస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. తాను డబ్బు, పదవులకు లొంగే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. తనపై నమ్మకంతో ప్రచార ప్లానింగ్ కమిటీ చీఫ్​కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు ఇవ్వడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చేందుకు తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని వెల్లడించారు.


Next Story