MLC Kavitha | మళ్లీ యాక్టీవ్.. ఈ సారి గురి తప్పకుండా పక్కా స్కెచ్!

by Rajesh |   ( Updated:2023-07-26 05:47:55.0  )
MLC Kavitha |  మళ్లీ యాక్టీవ్.. ఈ సారి గురి తప్పకుండా పక్కా స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని సెగ్మెంట్లలో అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, పెండింగ్ పనులపై సమీక్షిస్తున్నారు. సామాజికవర్గ నేతలతో పాటు అన్ని కార్మికుల సంఘాల నేతలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు యువతతో ముఖాముఖి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌గా యాక్టీవ్ అయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు రావడంతో మార్చిలో మూడుసార్లు విచారణకు హాజరయ్యారు. గత కొంత కాలంగా ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీలో కేడర్‌లో కొంత నైరాశ్యం నెలకొనడంతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతందని భావించిన కవిత మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్‌పై దృష్టిసారించారు.

నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఎప్పటికప్పడు ఎండగడుతున్నారు. వ్యవసాయరంగానికి 3గంటలు విద్యుత్ చాలన్న వ్యాఖ్యలను ఖండిస్తూ విద్యుత్ సౌధా వద్ద ధర్నాకు దిగారు. పార్టీ నేతల్లో ఒక్కసారిగా జోష్ నింపారు. రేవంత్, కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు.

పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెండింగ్ పనులపై ఆరా తీస్తున్నారు. చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ఎస్టీమేషన్ తీసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెరువులు, కాల్వల అభివృద్ధిపై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలు తీసుకుంటున్నారు.

అదే విధంగా నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్టీ పరిస్థితి, ప్రతిపక్షపార్టీల విధానాలను తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలో గ్రూపులపై సైతం ఆరా తీసి వివరాలు తెలుసుకుంటున్నారు. అదే విధంగా సింగరేణి సమస్యలు, కార్మికులు, ఉద్యోగుల తదితర వివరాలను సేకరిస్తున్నారు.

మరోవైపు యువతను ఆకట్టుకునేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఐటీహబ్‌ను సైతం ప్రారంభించిన కవిత.. స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే మరోసారి పార్టీ కేడర్‌తో ఆత్మీయసమ్మేళనాలు సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల నేతలతో భేటీ ప్రారంభించారు. వారి సమస్యలను తెలుసుకొని పరిషార్కానికి హామీలు ఇస్తున్నారు. అదే విధంగా పలు కార్మిక యూనియన్లతో భేటీ అవుతున్నారు.

సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇలా పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాలకు, పార్టీ కేడర్‌కు దగ్గరయ్యేందుకు కవిత చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని స్తబ్దతను తొలగించే చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల్లోని గ్రూపులపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Advertisement

Next Story