కన్ ఫ్యూజ్ చేస్తోన్న సర్వే సంస్థలు.. తటస్థ ఓటర్లపై చూపే ప్రభావంపై టెన్షన్!

by GSrikanth |
కన్ ఫ్యూజ్ చేస్తోన్న సర్వే సంస్థలు.. తటస్థ ఓటర్లపై చూపే ప్రభావంపై టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా.. నేనా.. అనే తరహాలో తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్ పేరుతో రిపోర్టులను గుప్పిస్తున్నాయి. ఒక్కో సంస్థ అంచనాలు ఒక్కో తీరులో ఉంటున్నాయి. ఇప్పటివరకు సుమారు పది సంస్థలు సర్వే చేయగా అందులో మెజారిటీ కాంగ్రెస్‌కే అనుకూల పవనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. కొన్ని టీవీ చానెళ్లు ప్రైవేటు సంస్థలతో కలిసి చేసిన సర్వేలు వీటికి భిన్నంగా ఉన్నాయి. ఒకటి హంగ్ వస్తుందని పేర్కొంటే మరొకటి బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని వెల్లడించాయి. రానున్న రోజుల్లో మరికొన్ని ఒపీనియన్ పోల్ అంచనాలు కూడా వెలువడనున్నాయి. అయితే అన్ని సర్వేల్లో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమని తేలడం గమనార్హం.

వ్యూహాల్లో మార్పులు..

గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నది. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, సిక్స్ గ్యారెంటీస్ పై కాంగ్రెస్ ఆధారపడుతున్నది. పదేళ్ల ప్రగతి, సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని, ఆ పార్టీ నేతల వ్యక్తిత్వాన్ని ఎక్స్ పోజ్ చేయడం ద్వారా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. కాంగ్రెస్ నేతలు చేసిన మూడు గంటల కరెంటు లాంటి కామెంట్లనే ప్రస్తావిస్తూ ఆ పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లానుకుంటున్నది. మరోవైపు పలు సర్వే ఫలితాలు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నది. దీంతో సర్వేలన్నీ ఫేక్ అంటూ బీఆర్ఎస్ రియాక్ట్ అవుతున్నది. అంతేకాకుండా ప్రచార సరళిలోనూ తగిన మార్పులు చేసుకుంటున్నది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్‌పై ఇన్‌చార్జిలతో మీటింగ్ ఏర్పాటుచేసుకున్నది.

తటస్థ ఓటర్లను ఆకట్టుకునేలా..

రెండు పార్టీలకు సంప్రదాయ ఓటర్లు ఉన్నప్పటికీ తటస్థ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. సర్వే సంస్థల అంచనా ఫలితాలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తటస్థ ఓటర్లలో కన్‌ప్యూజన్ క్రియేట్ చేయడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు ఉన్నాయని, బీఆర్ఎస్ మీద పైచేయి సాధిస్తుందని తేలింది. ఇది జనంలోకి వెళ్తే ప్రమాదరకమని బీఆర్ఎస్ భావిస్తున్నది. కట్టడి చర్యలు చేయకుంటే ముప్పేనని గ్రహించింది. సరిగ్గా ఇలాంటి సమయంలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండే సర్వే ఫలితాలు రావడం ఒకింత రిలీఫ్ ఇచ్చినట్లయింది. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని సర్వే ఫలితాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

మైండ్ గేమ్ ఫలిస్తుందా!

సర్వే సంస్థలు వెల్లడించే ఫలితాలతో ప్రజల మైండ్‌సెట్ మారుతుందా అనే చర్చలూ లేకపోలేదు. ఈ సర్వే సంస్థల నిజాయితీపైనే కాక పార్టీలు ప్రలోభాలతో అనుకూలమైన ఫలితాలను తెప్పించుకుంటున్నాయనే అభిప్రాయాలూ జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇండియా టుడే-సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈసారి తెలంగాణలో హంగ్ తప్పదని, ఎక్కువ సీట్లు, ఓట్ల శాతంతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తేలింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదన్న క్లారిటీ ఏర్పడింది. దీనికి ముందు ప్రైవేటు సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. రాహుల్‌గాంధీ మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత ఇండియా టుడే రిజల్టు రావడంతో బీఆర్ఎస్ నేతల్లో మేధోమథనం మొదలైంది.

‘ఇండియా టీవీ’ సర్వేలో బీఆర్ఎస్..

మరోవైపు ఇండియా టీవీ సంస్థ నిర్వహించిన సర్వేలో కనీసంగా 70 స్థానాలతో బీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్ 34 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడైంది. దీంతో బీఆర్ఎస్ నేతలకు ఉపశమనం లభించింది. బీఆర్ఎస్‌కే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని సర్వే సంస్థలూ ఫలితాలను వెల్లడిస్తాయన్న వార్తలు గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. దీంతో తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్న సర్వేలే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సర్వే లెక్కలు పోలింగ్ నాటికి ఎన్ని తీరుల్లో మారుతాయనేది ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ పార్టీల మైండ్ గేమ్ పబ్లిక్ పల్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలకంగా మారింది.


చర్చనీయాంశంగా ఫలితాలు

ప్రజల నాడిని సర్వే సంస్థలు పసిగట్టి ఫలితాలు వెల్లడిస్తున్నాయా?.. లేక ప్రజల అభిప్రాయాలను ఫిక్స్ చేసేలా దోహదపడుతున్నాయా?.. ఈ చర్చ ఇప్పుడు విద్యాధికులైన పట్టణ, గ్రామీణ ఓటర్లలో చోటుచేసుకున్నది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారా?.. పదేళ్ల ప్రగతి కొనసాగాలని కోరుకుంటున్నారా?.. యాంటీ ఇన్‌కంబెన్సీ నిర్ణయిస్తుందా?.. సిక్స్ గ్యారెంటీస్ నమ్మకం కలిగిస్తుందా?.. ఇలాంటివన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. సర్వే ఫలితాలకు ప్రజాభిప్రాయాన్ని మార్చే శక్తి ఉన్నదని పార్టీలు బలంగా నమ్మితే రానున్న రోజుల్లో వారి ప్రయత్నాలు, శక్తికి తగినట్లుగా ‘లెక్కలు ఎన్ని విచిత్రాలు చేస్తాయో’ వేచి చూడాల్సిందే.

ఎన్నికల కోడ్ టైమ్ లో ఆంక్షల్లేవా?

ఎన్నికల షెడ్యూలును ప్రకటించడంతోనే కోడ్ అమల్లోకి వస్తుంది. పోలింగ్‌కు ముందు జరిపే ఒపీనియన్ పోల్, పోలింగ్ తర్వాత వెల్లడించే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆంక్షలు పెట్టింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఈ నిబంధనలను అమలు చేస్తున్నది. ఒపీనియన్ పోల్ పేరుతో సర్వే నిర్వహించడం, ఫలితాలను వెల్లడించడానికి కొన్ని పరిమితులున్నాయి. పోలింగ్ ముగియడానికి 48 గంటల వ్యవధిలో వీటిని నిర్వహించడం లేదా వెల్లడించడం నిషేధం. ఎన్నికల ప్రచారం ముగిసే సమయం వరకూ వీటిని వెల్లడించడానికి వెసులుబాటు ఉన్నది. పోలింగ్ మొదలైన తర్వాత ఓటింగ్ సరళిని దృష్టిలో పెట్టుకుని ఎగ్జిట్ పోల్ పేరుతో సర్వే ఫలితాలను వెల్లడించడం నిషేధం. పోలింగ్ ప్రక్రియ (పోలింగ్ సమయం) మొత్తం ముగిసిన తర్వాత మాత్రమే వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు వెల్లడవుతున్న ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను ఏ ప్రసార మాధ్యమం ద్వారానైనా క్యాంపెయిన్ ముగిసేంత వరకూ వెల్లడించడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవు.

Next Story