గవర్నర్‌ను స్వయంగా సచివాలయానికి ఆహ్వానించిన సీఎం.. సయోధ్య కుదిరినట్లేనా?

by Disha Web Desk 2 |
గవర్నర్‌ను స్వయంగా సచివాలయానికి ఆహ్వానించిన సీఎం.. సయోధ్య కుదిరినట్లేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాదాపు రెండేండ్లుగా ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య సం బంధాలు ఉప్పు-నిప్పుగా కొనసాగా యి. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా తనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోటోకాల్ లేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిప్పులు చెరిగారు. రాజ్‌భవన్‌ లో బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో తమిళిసై సెటైర్ వేశారు. ‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర’ అంటూ కా మెంట్ చేశారు. తాజాగా గోల్కొండ కోట వేదికగా జరిగిన పంద్రాగస్టు వే డుకలకూ గవర్నర్‌కు ప్రభుత్వం నుం చి ఆహ్వానం అందలేదు. ఇదంతా గ తం. కానీ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయిం చే కార్యక్రమానికి హాజరైన సందర్భంగా గవర్నర్‌తో సీఎం దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. అనూహ్యంగా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం ఆహ్వానం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఇన్వైట్ చేశారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించి వస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే వారిద్దరూ శ్రావణ శుక్రవారం రోజున ఒకే కార్యక్రమంలో కలిసి పాల్గొంటున్నారు. గతానికి భిన్నంగా ‘హమ్ ఏక్ హై’ అనే తీరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ చర్చలకు తావిచ్చింది.

వివాదం సద్దుమణిగినట్లేనా?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గవర్నర్‌తో సఖ్యత కోసం సీఎం చొరవ తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వైపు జనగాం జిల్లా వల్మీడి గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయ శంకుస్థాపన, విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి సీఎంను, చినజీయర్‌నూ ఒకే వేదిక మీద కలుపుతున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వీరి మధ్య ఉన్న గ్యాప్‌ను ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక్కటి చేస్తున్నది. ఇప్పుడు అలాంటి కార్యక్రమమే గవర్నర్, సీఎంను ఒకే వేదిక మీదకు చేరుస్తున్నది. ఎన్నికలకు ముందు ప్రజల, రాజకీయ పార్టీల ఊహలకు అందని తీరులో తూర్పు-పడమరగా ఉన్న సీఎం, గవర్నర్ పరిపాలనా సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి.

బిల్లులకు మోక్షం!

రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఇంతకాలం నడిచిన ఘర్షణ వాతావరణం ఇప్పుడు సద్దుమణిగినట్లేనా? గవర్నర్ వ్యవస్థే అవసరం లేదన్న ప్రభుత్వ విమర్శలన్నీ సమసిపోయినట్లేనా? ప్రొటోకాల్ ఇవ్వకుండా ప్రభుత్వం తనను అవమానిస్తున్నదనే గవర్నర్ ఆరోపణలన్నీ ఇక ఒకప్పటి మాటలేనా? వీటన్నింటికీ సచివాలయంలో శ్రావణ శుక్రవారం రోజున జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ముగింపు పలుకుతున్నది. రాజ్‌భవన్‌లో ఆమోదం కోసం వేచి చూస్తున్న, పరిశీలన పేరుతో జాప్యమవుతున్న బిల్లులన్నింటికీ మోక్షం లభించిందనే మాటలు వినిపిస్తున్నాయి.


Next Story