చివరి కేబినెట్ భేటీ జరిగేనా.. సీఎం అనారోగ్యంతో వారం రోజులుగా వాయిదా!

by Disha Web Desk 2 |
చివరి కేబినెట్ భేటీ జరిగేనా.. సీఎం అనారోగ్యంతో వారం రోజులుగా వాయిదా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుందని ఊహగానాలు ఊపందకున్నాయి. అయితే షెడ్యూలు వచ్చేలోపు చివరి కేబినెట్ భేటీ జరుగుతుందా? లేదా? అనే చర్చ జరుగుతున్నది. వైరల్ ఫీవర్ కారణంగా గత నెల 17 నుంచి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పరిమితమయ్యారు. ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆయన కుదుటపడే చాన్స్ ఉంది. అయితే ఈలోపు ఎన్నికల షెడ్యూలు వస్తే కేబినెట్ భేటీ ఉండదనే టాక్ నడుస్తున్నది. ఎన్నికల షెడ్యూలుకు ముందు నిర్వహించే కేబినెట్ భేటీ చాలా కీలకంగా ఉంటుంది. ఆ సమావేశంలో ప్రజలను ఆకర్షించేందుకు పలు నిర్ణయాలు తీసుకోవడం అనవాయితీ. కానీ ప్రస్తుతం కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని టాక్.

మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుందనే సంకేతాలు బలంగా ఉన్నాయి. ఈ లోపు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు కాబట్టి, కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశాలు లేవని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. కేబినేట్ లో తీసుకోవాల్సినంత పెద్ద నిర్ణయాలు ఏం లేవని, ఒకవేళ ఉంటే సర్క్యులేషన్ పద్ధతిలో నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉందని సదరు ఆఫీసర్ తెలిపారు. ఇప్పటికే కీలకమైన నిర్ణయాలను సర్య్యులేషన్ పద్ధతిలో మంత్రుల నుంచి సంతకం తీసుకుంటున్నట్టు తెలిసింది.

కేబినెట్ ఆమోదంతోనే ఐఆర్

కేబినెట్ భేటీ నిర్వహించలేని పరిస్థితులు ఉన్నప్పుడు సర్క్యులేషన్ పద్ధతిలో నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపడం సహజంగా జరుగుతుంటుంది. ఫైల్స్ ను మంత్రుల వద్దకు పంపి వాటిపై సంతకం తీసుకుంటుంటారు. ఈమధ్య ఉద్యోగులకు 5 శాతం ఐఆర్ ప్రకటించారు. ఆ నిర్ణయంపై సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రుల ఆమోదం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో కొన్ని నిర్ణయాలను కేబినెట్ ఆమోదం లేకుండానే అమలు చేశారు. ప్రస్తుతం వాటికి అమోదం తప్పనిసరి కావడంతో సంబంధిత పైల్స్ ను కూడా సర్య్యులేషన్ పద్ధతిలో మంత్రుల నుంచి సంతకం తీసుకుంటున్నట్టు తెలిసింది.


Next Story