ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది అన్ని పార్టీల్లో కొత్త టెన్షన్.. ప్రజల పల్స్ తెల్సుకునేందుకు విశ్వప్రయత్నం..!

by Disha Web Desk 19 |
political Partys
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో టెన్షన్ మొదలైంది. అధికారమే లక్ష్యంగా తమ భవిష్యత్‌ను మలచుకునేందుకు ‘సర్వే’ల బాటపట్టాయి. జనం ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు?, ఏ నాయకుడి మీద వ్యతిరేకత ఉన్నది?, ఏ నేతను చేర్చుకుంటే పార్టీకి లాభముంటది? అవతలి పార్టీల మైనస్ ఏంటీ?, ప్రజలు ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు?, ప్రస్తుతమున్న పథకాలపై వారి వైఖరి ఎలా ఉన్నది? లాంటి అనేక అంశాలపై రిపోర్టు తెప్పించుకుంటున్నాయి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేనిఫెస్టోను తయారుచేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి రావాలని యత్నిస్తుండగా ఎంఐఎం పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఆరాటపడుతున్నది. సీపీఎం, సీపీఐ, వైఎస్ఆర్టీపీ, శివసేన, ప్రజాశాంతిపార్టీ, ఆప్, బీఎస్పీ, తదితర పార్టీలు మనుగడకోసం అష్టకష్టాలు పడుతున్నాయి. తరచూ ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు సర్వేలు చేయిస్తూ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నాయి.

ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌తో పాటు ప్రైవేటు ఏజెన్సీలతో సర్వేలు నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంతంగా సైతం సర్వేలు చేయిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజానాడిని తెలుసుకునేందుకు సర్వేలను ముమ్మరం చేశాయి. సర్వే రిపోర్టుల ఆధారంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపైనా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే వివరాలను సైతం సేకరిస్తున్నాయి.

బలమైన నాయకులకు ఆఫర్లు

గ్రామస్థాయిలో బలమైన నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే తమ పార్టీ నుంచి నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. పలువురికి ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమపార్టే అధికారంలోకి వస్తుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ సైతం ఆఫర్ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గ్రామస్థాయి నుంచి చేరికలు ఊపందుకున్నాయి.

కుల సంఘాలపై దృష్టి

మరోవైపు సామాజిక వర్గాలపైనా పార్టీలు దృష్టిసారించాయి. ఎన్నికల నోటిఫికేషన్ ముందే కులాల వారీగా సమావేశాలు నిర్వహించి వారి ఓట్లు పడేలా చర్యలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసం గ్రామాల్లో ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం తీసుకొచ్చే బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశాలను పరిశీలిస్తున్నారు. 15రోజులకు ఒకసారి సర్వే రిపోర్టులను పార్టీలకు సర్వే ఎజెన్సీలు అందజేస్తున్నాయి. వాటి అనుగుణంగానే అన్నిపార్టీలు ముందుకు సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

అసెంబ్లీ సమావేశాల్లో Congress,BJP ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు KCR భారీ వ్యూహం..!

AP మన్‌ కీ బాత్‌’ ఆలకిస్తారా... ?

Next Story

Most Viewed