మజ్లిస్ రిక్వెస్ట్‌ను ఆమోదించిన కేంద్ర ఎలక్షన్ కమిషన్

by Disha Web Desk 2 |
మజ్లిస్ రిక్వెస్ట్‌ను ఆమోదించిన కేంద్ర ఎలక్షన్ కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లను చీల్చడానికి మజ్లిస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నదనే ఆరోపణలు జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తున్న సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నది. తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీగా ‘పతంగి’ని కామన్ సింబల్‌గా కేటాయించినట్లే ఆ రెండు రాష్ట్రాల్లోనూ అవకాశం కల్పించాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. అన్ని స్థానాల్లో పోటీచేయాలనుకుంటున్నందున కామన్ సింబల్‌గా ‘పతంగి’ని ఇవ్వాలని కోరారు. దీన్ని పరిశీలించిన ఈసీ.. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్ ప్రకారం సానుకూలంగా స్పందించింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ ‘పతంగి’ గుర్తుతోనే పోటీచేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అసదుద్దీన్‌తో పాటు ఆ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు సర్క్యులర్ జారీచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేయగా, ఇప్పటివరకు నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేల్లోనూ ఇలాంటి అంచనాలే వెలువడ్డాయి. ముస్లిం ఓటు బ్యాంకును చీల్చి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టడం కొసమే మజ్లిస్ పోటీ చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో మజ్లిస్ ఆ రెండు రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావించడం గమనార్హం.


Next Story