అసలు ప్రజలు మనల్ని నమ్ముతారా?.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో అంతర్మతనం

by Disha Web Desk 2 |
అసలు ప్రజలు మనల్ని నమ్ముతారా?.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో అంతర్మతనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు ఆపాలని ఈసీ ఆర్డర్స్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఎన్నికల్లో రైతుల ఓట్లు పక్కా పడతాయని అనుకున్న తరుణంలో ఇలా జరగడంతో ఏం చేయాలనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది. రైతులను, ప్రజలను ఎలా కన్విన్స్ చేయాలి? తాము చెప్పే మాటలను ఎంతవరకు నమ్ముతారనే గుబులు బీఆర్‌ఎస్ నేతల్లో మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గట్టిపోటీ నెలకొన్న తరుణంలో ఎలా గట్టేక్కాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మథనపడుతున్నారు.

బీఆర్ఎస్‌కు ఈసీ షాక్ ఇచ్చింది. రైతుబంధు డబ్బులు ఈనెల 28లోగా రైతుల ఖాతాల్లో జమ చేసుకోవచ్చని తొలుత అనుమతి ఇచ్చింది. అయితే మంత్రి హరీశ్ రావు రైతు బంధుపై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికలకు రెండ్రోజుల ముందు రైతుబంధు డబ్బులు జమ అయితే ఈజీగా గట్టెక్కుతామని బీఆర్ఎస్ భావించింది. కానీ సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా రైతులు కీలకం. సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిపైనే బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే వారి ఓటు బ్యాంకు ఎటుమళ్లుతుంది, బీఆర్ఎస్‌కు పడుతుందా.. లేదా? అనే ఆందోళన మొదలైంది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత రైతుబంధు జమచేస్తామంటే నమ్ముతారా? అనేది పార్టీలోనే చర్చనీయాంశం అయింది. ఓట్లు పడకపోతే మాత్రం గెలుస్తామా? అనే డైలమాలో నేతలు పడ్డారు.

సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం

రైతుల్లో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా పథకాన్ని ప్రవేశపెడతామని, రూ. 2 లక్షల రుణమాపీ చేస్తామని, పవర్లోకి రాగానే రూ. 15 వేలు ఇస్తామంటూ హామీ ఇస్తున్నది. కాగా ప్రజెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నది. ఈ తరుణంలో రైతులను సైతం ఆ పార్టీ వైపు మొగ్గుచూపకుండా బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రైతుబంధుపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయడాన్ని అస్త్రంగా వాడుకోవాలని, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రైతులు చేజారకుండా చూసుకోవాలని భావిస్తున్నది. యాసంగిలో సాయం వేస్తామని సిద్ధం చేసినా కాంగ్రెస్ కుట్ర చేసిందని, దానివల్లే సాయం ఆగిందని ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలంతా వ్యాఖ్యనిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజూ మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో ఆ రోజు సైతం కాంగ్రెస్ తీరును ఎంగట్టాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

బీఆర్ఎస్‌తోనే రైతు సంక్షేమని, కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఆగమవడమే గాకుండా రైతుబంధు బంద్ అవుతుందని, కరెంటు కష్టాలు వస్తాయని సెంటిమెంట్‌కు తెరదీసింది. ప్రజల్లో రైతుబంధుపై విస్తృత చర్చ జరిగేలా ప్రయత్నం చేస్తున్నది. ఇదిలా ఉండగా పంట పెట్టుబడి సాయం ఇస్తామని ముందు నుంచి చెప్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఈసీ షాక్ ఇవ్వడంతో ప్రజలను, రైతులను ఎలా కన్విన్స్ చేయాలోనని లోలోన మథన పడుతున్నారు. మరోవైపు డిసెంబర్ 6న రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తామని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రైతుల్లో భరోసా కల్పించే ప్రయత్నం కూడా బీఆర్‌ఎస్ చేస్తున్నది. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలతో పాటు ఎరువులు, ధాన్యం కొనుగోళ్ల సమస్యతోపాటు రైతుబంధుకు సైతం ఫుల్ స్టాప్ పెడతారని ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఎకరాకు రూ.16 వేలు వేస్తామని కేసీఆర్ ఇస్తున్న హామీని రైతులు ఏ మేరకు విశ్వసిస్తారోననే అంశం కూడా బీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశం అయింది.



Next Story

Most Viewed