రూ.100కోట్లతో బౌద్ధవనం నిర్మాణం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 2 |
రూ.100కోట్లతో బౌద్ధవనం నిర్మాణం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బుద్ధిజం పూర్వ వైభవానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే బుద్ధవనం ప్రాజెక్టును రూపకల్పన చేసి బుద్ధిజం అభివృద్ధికి, బౌద్ధ ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని జెటవనారమయ అనురాధపురలోని పురాతన బౌద్ధ క్షేత్రంను గురువారం సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బౌద్ధ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తెలంగాణలో బుద్ధిజం పరిరక్షణకు, బౌద్ధ కేంద్రాల అభివృద్ధిపై రూపొందించిన బౌద్ధ ఆధ్యాత్మిక సావనిర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో బుద్ధవనం నిర్మాణం చేపట్టామన్నారు.

బుద్ధుడు కాలం నుంచి తెలంగాణలో బుద్ధిజం కొలువైందని తెలిపారు. రాష్ట్రంలోని కోటిలింగాల, బాదంకుర్తి, ఫణిగిరి, నేలకొండపల్లి లాంటి ప్రాంతాలలో బుద్ధిజం వైభవం చాటిందన్నారు. బుద్ధిజం కేంద్రాలను పరిరక్షిస్తూ వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా, బౌద్ధ విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకుడు నవీన్ గుణవర్దనే, డాక్టర్ శివనాగిరెడ్డి, ప్రముఖ నటులు గగన్ మాలిక్, డాక్టర్ మౌనిక సిరివర్ధన, శ్రీలంక దేశ బౌద్ధ ఆధ్యాత్మికవేత్తలు, శ్రీలంక దేశ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed