కౌంటింగ్ వేళ టీ.కాంగ్రెస్ అప్రమత్తం.. రంగంలోకి రాహుల్ గాంధీ

by GSrikanth |
కౌంటింగ్ వేళ టీ.కాంగ్రెస్ అప్రమత్తం.. రంగంలోకి రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. రేపటి ఫలితాల్లో ఎవరు పై చేయి సాధిస్తారు మరెవరు నిరాశ పడుతారనే దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల కంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎగ్జిట్స్ పోల్స్ తో సంబంధం లేకుండా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓ వైపు కేసీఆర్ మరో వైపు కాంగ్రెస్ ఎత్తులు పై ఎత్తులతో తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కితోంది. కాగా ఫలితాల వేళ కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బోటాబోటి మెజార్టీ వస్తే గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు కేసీఆర్ ఒరలో చిక్కకుండా వారిని కాపాడుకునేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది. ఓ వైపు ప్రగతి భవన్ లో కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకేతో పాటు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జేవాలా తదితర ముఖ్య నేతలను అధిష్టానం రంగంలోకి దింపడం ఆసక్తికర పరిణామంగా మారింది. హైకమాండ్ ఆదేసాలతో డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా మిగతా నేతలు ఇవాళ సాయంత్రానికి హైదరాబాద్ కు రీచ్ కాబోతున్నారు.

కేసీఆర్ వ్యూహాలకు చిక్కకుండా ప్లాన్:

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన మెజార్టీ రాబోతున్నదని సర్వే సంస్థలు అంచనాలు వేసినప్పటికీ.. కేసీఆర్ వ్యూహాలపై కాంగ్రెస్ మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఒక వేళ హంగ్ పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలో కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికతో ఉన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేసుకున్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్ వ్యూహానికి తమ అభ్యర్థులు చిక్కకుండా వారిని కాపాడుకోవడంపై హస్తం అధిష్టానం దృష్టి సారించింది. ఈమేరకు కౌంటింగ్ ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో గెలుపొందే అభ్యర్థులు చేజారకుండా అభ్యర్థులంతా తక్షణమే హైదరాబాద్ కు రావాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం తాజ్ కృష్ణలో అభ్యర్థులకు ఏఐసీసీ ప్రతినిధులు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వారిని క్యాంప్ కు తరలిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే రేపు గెలుపు ధృవపత్రాలను అభ్యర్థులు కాకుండా అభ్యర్థుల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకునేలా అనుమతి ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరినప్పటికీ అటుంటి అవకాశం లేదని సీఈవో బదులిచ్చారు. దీంతో గెలుపొందిన అభ్యర్థులను తొలుత హైదరాబాద్ కు పరిస్థితులను బట్టి బెంగళూరుకు తరలిస్తారనే టాక్ వినిపిస్తోంది.

రంగంలోకి రాహుల్ గాంధీ:

రేపు కౌంటింగ్ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు టీకాంగ్రెస్ ముఖ్యనేతలతో జూమ్ లో రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. ఎన్నికల ఫలితాలు.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. వీలును బట్టి అభ్యర్థులతోనే ఆయన మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కౌంటింగ్ తో పాటు అభ్యర్థులతో సమన్వయం చేసుకునేందుకు మరికొంత మంది ఏఐసీసీ నేతలను కాంగ్రెస్ అధిష్టానం హైదరాబాద్ కు పంపబోతున్నది. ఇవాళ సాయంత్రానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, రమేశ్ చిన్ని తల, దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్, అలీఖాన్, విష్ణునాథ్, కర్నాటక మంత్రులు జార్జ్, బోసురాజు తదితరులు హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు.

Next Story

Most Viewed