మోడీ సభకు విజయశాంతి, కోమటిరెడ్డి గైర్హాజరు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 2 |
మోడీ సభకు విజయశాంతి, కోమటిరెడ్డి గైర్హాజరు.. రేవంత్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ పర్యటన తీవ్ర నిరాశ పరిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాకు ప్రధాని కొత్తగా నిధులు, పథకాలు ప్రకటిస్తారని ఆశించామని కానీ జిల్లాకు మొండిచేయి చూపించారని విమర్శించారు. ప్రధాని పర్యటన ప్రజా ధనం వృథా తప్ప ఈ పర్యటనతో రాష్ట్రానికి కొత్తగా ఒరిగిందేమి లేదన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటి వాటిపై మోడీ ద్వారా ప్రకటనలు ఉంటాయని ఆశించామని కానీ ప్రధాని మాత్రం పసుపు బోర్డును ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని ఎద్దేవా చేశారు. నిన్నటి సభలో మోడీ కుటుంబ పాలన గురించి మాట్లాడారు కానీ కుటుంబ దోపిడి గురించి మాట్లాడలేదని గతంలో ఇదే ప్రధాని కాళేశ్వరం, మిషన్ భగీరథ, సింగరేణి దోపిడీ, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ బలంగా బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్‌కు సహకరించేందుకే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన ప్రధానిని మహబూబ్ నగర్ కు ఆహ్వానించడంపై బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు కాబట్టే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు పాలమూరు సభకు గైర్హాజరు అయ్యారని భావిస్తున్నామన్నారు. కేటీఆర్, హరీష్ రావులు.. బిల్లా, రంగా లాంటి వారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరిద్దరు కాంగ్రెస్ హామీలను ప్రశ్నిస్తున్నారని.. దేశంలో ఎక్కడా లేని పథకాలను కాంగ్రెస్ గత హాయంలో అమలు చేసిందని 2004 నుంచి 2024 వరకు కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన హామీలు.. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో చర్చకు రావాలని హరీష్ , కేటీఆర్‌కు సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీది దింపుడు కళ్లెం ఆశలని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌లో బహు సీఎంలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు స్పందిస్తూ బహు నాయకత్వం ఉంటే తప్పేందని ప్రశ్నించారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లో ఐదేళ్లు ఒక్కరే సీఎంగా ఉన్నారని చెప్పారు.


Next Story