దసరా తర్వాతే.. టాస్క్‌ను నిర్వర్తించనున్న మాజీ మంత్రి జానారెడ్డి టీమ్!

by Disha Web Desk 2 |
దసరా తర్వాతే.. టాస్క్‌ను నిర్వర్తించనున్న మాజీ మంత్రి జానారెడ్డి టీమ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా తర్వాత కాంగ్రెస్ పార్టీ అసంతృప్తుల బుజ్జగింపు కార్యక్రమాలు మొదలు కానున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి టీమ్ టాస్క్‌ను నిర్వర్తించనున్నది. పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు, తమ వర్గానికి టిక్కెట్ రాదని ఆలోచిస్తున్న ముఖ్యనేతలతో జానారెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. విడతల వారీగా అన్ని జిల్లాల నేతలతో మీటింగ్‌లు నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ను వీడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఏఐసీసీ నుంచి ఇప్పటికే టిక్కెట్లు రాని నేతల వివరాలు జానారెడ్డి టీమ్‌కు అందినట్లు సమాచారం. ముందుగా హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న నేతలతో జానా టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల పార్టీపై అసంతృప్తితో బయటకు వెళ్లిన కొల్లాపూర్ జగదీశ్వరరావును జానా బుగ్జించారు.

పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. దీంతో పాటు హైదరాబాద్‌లో నివాసం ఉండే మరి కొంత మంది నేతల ఇండ్లకు వెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరుతున్నారు. వివిధ ప్రైవేట్ సంస్థలతో పాటు కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలు, సునీల్ కనుగోలు రిపోర్టులన్నీ కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని పేర్కొన్నాయని, తొందరపాటు నిర్ణయాలు వద్దని జానారెడ్డి ఆయా నేతలకు వివరిస్తున్నారు. పదేళ్లు ఓపిక పట్టిన నేతలు.. మరో నెల రోజులు సహకరిస్తే.. మేలు జరుగుతుందని జానాటీమ్ సూచిస్తున్నది. ససేమిరా అని సహకరించని నేతలను కూడా జానారెడ్డి తన దైన శైలీలో పార్టీకి సహకరించేలా కృషి చేస్తున్నట్లు తెలుస్తున్నది. సెకండ్ లిస్టులో టిక్కెట్లు రాని నేతలతో దసరా తర్వాత నుంచి జానారెడ్డి భేటీ అవుతారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆశావహులతో బుజ్జగింపు కార్యక్రమాలు కొనసాగిస్తారు. అన్ని జిల్లాల్లో ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను కూడా తయారు చేస్తున్నట్లు టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు.

ప్రజలు గందరగోళం కాకుండా..

ఫస్ట్ లిస్టు రిలీజ్ తర్వాత కొంత మంది ఆశావహులు టిక్కెట్ రాలేదనే అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకున్నాడని, సునీల్ కనుగోలు తప్పుడు సర్వేలు చేసి.. ఇబ్బంది పెట్టాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవి కాంగ్రెస్ కేడర్‌ను, ప్రజలను గందరగోళంలోకి నెట్టి వేసింది. అసంతృప్తుల విమర్శలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని స్వయంగా ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ థాక్రే కూడా ఢిల్లీలో మీడియా సాక్షిగా వివరించారు. దీంతో ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశ్యంతోనే ముందస్తు చర్చలు చేయాలని జానారెడ్డి టీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. అసంతృప్త నేతల స్థాయిని బట్టి జానారెడ్డి పదవి భరోసాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed