నకిరేకల్‌లో హోరాహోరీ పోరు.. పాత ప్రత్యర్ధుల మధ్య ఢీ అంటే ఢీ!

by Disha Web Desk 2 |
నకిరేకల్‌లో హోరాహోరీ పోరు.. పాత ప్రత్యర్ధుల మధ్య ఢీ అంటే ఢీ!
X

దిశ నకిరేకల్: పాత ప్రత్యర్ధుల మధ్య ఢీ అంటే ఢీ.. హోరాహోరీ పోరు.. విజయం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నడుమ నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. టీఆర్ఎస్ నుంచి 2014, 2018 ఎన్నికల్లో బరిలో ఉన్న వేముల వీరేశం ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఇక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం ఇరు పార్టీల అభ్యర్థులు చేరికలు చేసుకోవడంతో నకిరేకల్ గడ్డపై చేరికల రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు కండువాలు కప్పుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం రాజకీయ ఉద్దండులకు నిలయం కావడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది.

గురు శిష్యుల్లో నెగ్గేదెవరు?

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 2009, 2014, 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరుల వెంట ఉండి నిలిచారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారికి ఎదురుగా నిలబడి పోరాడుతున్నారు. దీంతో ఇక్కడ గురు శిష్యుల మధ్య పోరుగా మారి పై చేయి సాధించే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. తాజాగా చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీలో చేర్చారు.. ఆ వెంటనే నార్కెట్ పల్లి మండల సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా కండువాలు మార్చారు. ఇలా ఎవరికి వారు పై చేయి సాధించేలా ఎత్తుగడలు కొనసాగిస్తున్నారు.

చేరికలపై విమర్శలు, ప్రతి విమర్శలు...

నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట, చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూరు, నకిరేకల్, కేతేపల్లి మండలాలు ఉన్నాయి. గత మూడు నెలలుగా నిత్యం పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి నిత్యం బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి.. కార్యకర్తలు చేర్చుతూ కండువాలు మారుస్తున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీలో ఉన్నారు తెలియక ప్రజలు అయోమయం చెందుతున్నారు. పార్టీ చేరికలపై ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఓటు లేని వారిని చేర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తుంటే.. మీకు మాపై వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారంటూ కాంగ్రెస్ వారు ప్రతి విమర్శ చేస్తున్నారు. ఇలా వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీనంతటిని గమనిస్తుంటే రానున్న రోజుల్లో ఈ చేరికలు దేనికి దారి తీస్తాయని అర్థం కావడం లేదంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story