హీటెక్కిన రాజకీయం.. పేలుతున్న మాటల తూటాలు

by Disha Web Desk 2 |
హీటెక్కిన రాజకీయం.. పేలుతున్న మాటల తూటాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ బస్సుయాత్రతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ పై, కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు సంధిస్తుండటంతో అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రాహుల్ పర్యటన ఒక్కసారిగా రాజకీయ వేడికి రగిల్చింది. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని ఆయన విమర్శలు సంధించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సైతం బీఆర్ఎస్ తరఫున అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి కేటీఆర్ రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్‌ది కుటుంబ పాల‌న అని అంటున్న రాహుల్ గాంధీ ఎవ‌రు..? అని ప్రశ్నించారు.

‘జవహర్ లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడటమా? అంటూ వ్యాఖ్యానించారు. ‘ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద నిల‌బడొచ్చు. సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. చ‌నిపోయిన ఇందిరా గాంధీని, రాజీవ్ గాంధీని, నెహ్రూని యాది చేసుకోవ‌చ్చు.. కానీ కేసీఆర్‌ది మాత్రం కుటుంబ పాల‌న అంట‌రు. ఇదెక్కడి నీతి నాక‌ర్థం కాదు’ అని అన్నారు. రూ. 80వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి అని రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

మంత్రులు సైతం ఫైర్..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ వచ్చినంకనే కాంగ్రెస్ నాశనం అయిందని ఆ పార్టీ నేతలే అంటున్నారన్నారు. ‘ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చినోడు రాసేస్తే... నువ్వు చదువుతాన్నవు.. రాహుల్ అని మండిపడ్డారు. ఎవరో రాసిస్తే మాట్లాడటం కాదు.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలని హితవు పలికారు. మరోమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సైతం రాహుల్ పై ఫైర్ అయ్యారు. రాహుల్ కుటుంబ పాలన, అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బోఫోర్స్ స్కాంతో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు.

నవ్వుకుంటున్నరు : ఎమ్మెల్సీ కవిత

రాహుల్ ప్రసంగం విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రాహుల్ చదువుతున్నారని ఆయన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వ్యయం కలిపితే రూ. లక్ష కోట్ల లోపే ఉందని, రూ.లక్ష కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా చేస్తారని మండిపడ్డారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story