బీఆర్ఎస్‌ను గెలిపిద్దాం.. MIM చీఫ్ అసదుద్దీన్ పిలుపు

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌ను గెలిపిద్దాం.. MIM చీఫ్ అసదుద్దీన్ పిలుపు
X

దిశ, జహీరాబాద్: ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉంటే పతంగ్ గుర్తుపై.. లేనిచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటేయాలని ఎమ్ఐఎమ్ శ్రేణులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈద్గా సమీపంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్‌తో కలిసి పాల్గొని ప్రసంగిస్తూ కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు. మైనార్టీల అభివృద్ధి తన బాధ్యతని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముక్కోణపు పోటీతోనే తమకు లాభమన్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి(వికారాబాద్ వ్యక్తి) ఇద్దరు ఆర్ఎస్ఎస్ మూలాలున్నవారెనన్నారు. జహీరాబాద్ ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలవాలవారని, వికారాబాద్ నుంచి వచ్చిన వ్యక్తిని అక్కడికి పంపించాలన్నారు.

ఎంఐఎం మైనారిటీల అభివృద్ధి కోసం నిరంతర పోరాడుతుందన్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధ సంఘటనల్లో స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పాలస్తీనియుల సంక్షేమం కోసం భగవంతుని ప్రార్థించాలని కోరారు. జీ20 అధ్యక్షుడైన ప్రధాని జోక్యం చేసుకొని శాంతింపజేయాలన్నారు. కర్ణాటకలో లేని సంక్షేమం తెలంగాణలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మైనార్టీలకు విద్య, సంక్షేమం మెండుగా అందుతున్నాయన్నారు. 9 సంవత్సరాలలో 12 వేల కోట్ల నిధులను విద్య కోసం వెచ్చించారన్నారు. పది లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారన్నారు. 80 వేల మంది విద్యార్థులు టిమ్రీస్ పాఠశాలల్లో తమ విద్యను పూర్తి చేసుకున్నారన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ విభక్త కవలలు, నాణానికున్న బొమ్మ బులుసు లాంటివని, వారితో దేశానికి నష్టం చేశారు. "కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ తల్లి" అనే పేరుతో బాంసేఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్సుద్ రాసిన పుస్తకాన్ని పలుమార్లు ఉచ్చరించారు. ఈ సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్, పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు అతర్ హైమద్, ముఖ్యనేతలు మొహియొద్దీన్ గౌరీ, కర్ణాటక, హైదరాబాద్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు, కర్ణాటక తెలంగాణకు చెందిన పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story