పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంను స్ర్టాంగ్​రూంకు తీసుకొచ్చే బాధ్యత వారిదే!

by Disha Web Desk 2 |
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంను స్ర్టాంగ్​రూంకు తీసుకొచ్చే బాధ్యత వారిదే!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ర్టంలో పోలీసు బందోబస్తు హడావుడి మొదలైంది. బందోబస్తు కోసం కేంద్రబలగాలు రాష్ర్టానికి చేరుకుంటున్నాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు ఆదివారం 25 కేంద్ర పారామిలటరీ బలగాలు చేరుకున్నాయి. సెంట్రల్ ఫోర్స్‌ను నిర్ణయించిన వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలు, ఈవీఎంలను భద్రపరిచే స్ర్టాంగ్​రూంలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ బలగాల సేవలను వినియోగించుకోనున్నారు.


20 వేల కేంద్ర బలగాలు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని చర్యలూ తీసుకుంటోంది. అదనపు బలగాల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. 20 వేల మందికిపైగా బలగాలను పంపించడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ర్యాపిడ్​యాక్షన్​ఫోర్స్, ఇండో టిబెటిన్​బోర్డర్​పోలీసు, సీమా సశస్ర్తబల్,​అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే 25 టీములు రాష్ర్టానికి చేరుకోగా వీటిలో ఏడు టీమ్‌లను రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కేటాయించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు

మొదటి విడతలో వచ్చిన కేంద్ర పారా మిలటరీ బలగాల్లో సింహ భాగాన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించనున్నారు. మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, ఒడిషా సరిహద్దుల్లోని మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం ఉంది. ఆసిఫాబాద్, చెన్నూరు, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, యెల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, బెల్లంపల్లి, సిర్పూర్​(టీ) తదితర నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో పోలింగ్‌కు కనీసం నెల రోజుల ముందు ఈ బలగాలను విధుల్లోకి దింపితే ఆయా ప్రాంతాలపై వారికి పట్టు పెరుగుతుందన్న ఉద్దేశంతో మొదటి విడతలో వచ్చిన బలగాల్లో అత్యధికంగా ఈ ప్రాంతాల్లో మోహరించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పని చేసిన అనుభవం ఉన్న అధికారులు ఈ బలగాలను గైడ్ చేయనున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి

సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను నియమించనున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 6వేల సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్​కేంద్రాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల విధుల్లో రాష్ర్టానికి చెందిన 35వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు. రాష్ర్టంలో 497 పోలీస్​స్టేషన్లు ఉండగా 90 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 35వేల మందిని ఎన్నికల బందోబస్తు కోసం వినియోగించుకోనున్నారు. ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ర్టాంగ్ రూంల వద్ద కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. ఈ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్​కేంద్రాలకు తరలించటం, ఓటింగ్​ప్రక్రియ ముగిసిన తరువాత తిరిగి వాటిని స్ర్టాంగ్​రూంలకు చేర్చే బాధ్యతను కేంద్ర బలగాలే నిర్వర్తించనున్నాయి.



Next Story

Most Viewed