కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టు ఖరారు.. విడుదలకు ముందే రంగంలోకి పార్లమెంట్ అబ్జర్వర్లు!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టు ఖరారు.. విడుదలకు ముందే రంగంలోకి పార్లమెంట్ అబ్జర్వర్లు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టును ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నది. కర్ణాటకలోనూ అలాగే రిలీజ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని అసంతృప్తులకు చెక్ పెట్టాలంటే ఈ విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నారు. ఈలోపు పార్టీలోని అసంతృప్తులందరినీ బుజ్జగించేందుకు ఏఐసీసీ నుంచి పార్లమెంట్ అబ్జర్వర్లుగా కొనసాగుతున్న నేతలు రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్ లలో మకాం వేసి పార్టీ నేతలను సమన్వయం చేయనున్నారు. ఏఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకించినా బీఆర్ఎస్ కోవర్ట్ ఆపరేషన్ కు సహకరించినా పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడమని టీపీసీసీకి చెందిన ఓ నేత స్పష్టం చేశారు.

మూడు పేర్లు సెగ్మెంట్‌‌లలో...

కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టు దాదాపు ఖరారైంది. స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పేర్లను ఫైనల్ చేసి ఏఐసీసీకి జాబితాను పంపారు. వాళ్లు ఓకే చెప్పగానే లిస్టును ప్రకటించనున్నారు. అయితే అంతకంటే ముందే పార్లమెంట్ అబ్జర్వర్లకు పార్టీ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించింది. సిట్టింగ్‌లు, మాజీల సీట్లతో ఫస్ట్ రౌండ్‌లోనే 25 మందిని ఫైనల్ చేసిన స్క్రీనింగ్ కమిటీ కాంపిటీషన్ అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలకు మూడు పేర్ల చొప్పున సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించింది. సీఈసీ వివిధ సర్వేలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆ మూడు పేర్లలో ఒక అభ్యర్థిని ఫైనల్ చేశారు. ఈ పేరు రాష్ట్ర పార్టీ నేతలకు కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ 17 మంది పార్లమెంట్ అబ్జర్వర్లకు మాత్రమే తెలియపరుస్తున్నారు. వాళ్లను కూడా లీక్ చేయొద్దని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సూచిస్తూనే అభ్యర్థిని, ఆశావహులను సమన్వయం చేయాలని ఆదేశించడం గమనార్హం. రెండు రోజుల్లోనే అబ్జర్వర్లు జిల్లా కేంద్రాల్లో మకాం వేసి ఆశావహులను బుజ్జగించే ప్రయత్నం మొదలు పెట్టనున్నారు.

పదవులు ఉన్నాయ్...?

ఆశావహులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు సర్వే ఫలితాలను వినియోగించనున్నారు. సునీల్ ఇప్పటివరకు చేసిన రాష్ట్ర సర్వేలు, నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ఫ్లాష్​ సర్వే, పార్టీలతో సంబంధం లేకుండా చేసిన పాపులర్ సర్వే రిజల్ట్స్‌ను టికెట్లు ఆశిస్తున్న వారికి వివరించనున్నారు. పార్టీ తప్పనిసరిగా 80 సీట్లతో పవర్‌లోకి రానున్నదని కన్విన్స్ చేయనున్నారు. ఆ తర్వాత పార్టీలో వివిధ రకాల వెయ్యి నామినేటెడ్ పదవులు లభిస్తాయని భరోసా ఇవ్వనున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసినోళ్లను ఏఐసీసీ నుంచి పదవులు ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని పార్లమెంట్ అబ్జర్వర్లు కాంప్రమైజ్ చేయనున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు వంటి పోస్టులన్నీ టికెట్ రాని నేతలనే వరించనున్నాయంటూ కాన్ఫిడెన్స్ ఇవ్వనున్నారు.



Next Story

Most Viewed