ఈటలకు పోటీ ఎవరు? రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముందు బిగ్ టాస్క్

by Disha Web Desk 13 |
ఈటలకు పోటీ ఎవరు? రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముందు బిగ్ టాస్క్
X

దిశ, డైనమిక్ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయం రసపట్టుగా మారింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతున్నది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తుంటే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో రాజకీయం రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నది. ఈ స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే ఇక్కడ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరును బీజేపీ ప్రకటించడంతో మల్కాజిగిరి స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈటలకు ఢీకొట్టడం ఎలా?:

తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అభ్యర్థుల ఎంపిక నుంచే అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో అనేక నివేదికలు తెప్పించుకున్న జాతీయ నేతలు గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మల్కాజిగిరి స్థానంలో అనేక మంది పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపింది. ఆయనకు అయితేనే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించిన హైకమాండ్ ఆయన్నే అభ్యర్థిగా ప్రకటింది. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలకు చేరువవుతుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలోనే తలమునకలు కావడం చర్చగా మారింది. ఈ రెండు పార్టీలు మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నప్పటికీ మల్కాజిగిరి అభ్యర్థి విషయంలో ఇంకా లెక్కలు వేసుకుంటుండటంతో ఇక్కడ ఈటలకు పోటీనే లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ధీటైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు:

మల్కాజిగిరిలో గెలుస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ ఆర్థికంగా బలం కలిగిన నేత కోసం ఆలోచన చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని అంతా భావించినా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీల కూల్చివేత ఘటనలతో అనూహ్యంగా మల్లారెడ్డి కుటుంబం పోటీ నుంచి వెనకడుగు వేసిందనే టాక్ వినిపిస్తోంది. పోటీ చేయని విషయాన్ని మల్లారెడ్డి స్వయంగా కేటీఆర్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ మరో అభ్యర్థి కోసం వేట ప్రారంభించినట్లు ప్రచారం వినిపిస్తోంది. కేటీఆర్ అనుచరుడిగా పేరున్న శంభీపూర్ రాజుపేరును పరిశీలిస్తున్నా ఇక్కడ పోటీ ఈటలతోనే ఉంటుందనే అంచనాలతో ఈటలకు సరితూగే అభ్యర్థి అయితేనే బెటర్ అనే అభిప్రాయంతో కేసీఆర్ అభ్యర్థి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ నేతకు కాంగ్రెస్ గాలం!:

సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలుపొందడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో అభ్యర్థి విషయంలో తీవ్రమైన కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈటలను ఎదుర్కొనేందుకు ఆర్థిక బలం కలిగిన నేత కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ స్థానంలో మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తున్నా ఇదే మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి మైనంపల్లి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన గెలుపు అవకాశాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంపన్న వర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సైతం కొనసాగిస్తోందనే టాక్ వినిపిస్తోంది. సదరు నేత సీఎం సొంత జిల్లా కావడంతో సంప్రదింపులు పూర్తయ్యాయని అన్ని సజావుగా జరిగితే త్వరోలనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరి మల్కాజిగిరి బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఈటల వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ గా పోటీ ఉండబోతున్నదన్న అంచనాల నడుమ ఈటలపై పోటీకి ఈ రెడు పార్టీలు ఎలాంటి అభ్యర్థులను రంగంలోకి దింపుతారో చూడాలి మరి.



Next Story

Most Viewed