ఎంఐఎంలో ఈ మార్పేంటి?.. రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ మాటల వెనుక మర్మం ఇదేనా?

by Disha Web Desk 13 |
ఎంఐఎంలో ఈ మార్పేంటి?..  రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ మాటల వెనుక మర్మం ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితాతో పాటు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలతో పార్టీల మధ్య ఆలోచనలు పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. పాతబస్తీ మెట్రో రైలుకు శంకుస్థాపన కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి పనులను నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని, రాబోయే ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. అంతే కాదు రేవంత్ రెడ్డి మొడ్డితనంతో పట్టువదలకుండా పని చేస్తారంటూ సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పేరు చెబితేనా చిటపటలాడిన అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా ఎంపీ ఎన్నికల వేళ అనూహ్యంగా రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ త్వరలోనే కుప్పకూలుతుందని ఓ వైపు తమ మిత్రుడు కేసీఆర్ వ్యాఖ్యానిస్తే మరోవైపు ఓవైసీ మాత్రం ఐదేళ్లు మీ ప్రభుత్వమే ఉంటుందని సీఎంకు సపోర్ట్ గా మాట్లాడటం వెనుక కైట్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటనేది చర్చనీయాశంగా మారింది.

సీటు పదిలం కోసమా భవిష్యత్ వ్యూహమా?:

ఎంపీ ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో అసదుద్దీన్ కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ స్థానంపై ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ జాతీయ స్థాయిలో ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని అసద్ హింట్ ఇవ్వడం వెనుక హైదరాబాద్ పార్లమెంట్ లో తన సీటును పదిలపరుచుకునేందుకేనా? లేక బీఆర్ఎస్ కు ఎంఐఎం పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పి భవిష్యత్ లో కాంగ్రెస్ తో కలిసి నడవాలనే ఉద్దేశంతో హింట్ ఇచ్చారా అనేది చర్చగా మారింది. గతంలో ఎంఐఎం కాంగ్రెస్ లో కలిసి పని చేసిన సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్న నేపథ్యం, మరోవైపు బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ నేపథ్యంలో కాంగ్రెస్ తో చేతులు కలపడమే బెటర్ అనే నిర్ణయానికి ఓవైసీ వచ్చారా అందులో భాగంగానే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ఆ స్థానాల్లో మారనున్న సమీకరణాలు?:

పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పొత్తులు ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయించాయి. అయితే కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ మధ్య ప్రస్తుతం పొత్తు కొనసాగుతుండగా సీపీఎం ఎటువైపో ఇంకా తేల్చుకోలేదు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ కు అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తూ వచ్చిన ఎంఐఎం ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఒక వేళ ఎంఐఎం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్నా లేక పరస్పరం సహకారించుకున్నా పలు స్థానాల్లో ఫలితాలు ప్రభావితం కాబోతున్నాయా అనే చర్చ తెరపైకి వస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ హిందుత్వ వాదాన్ని బలంగా ప్రయోగిస్తోంది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే ఈ స్థానాల్లో ముస్లిం మైనార్టీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లితే బీజేపీ, బీఆర్ఎస్ లెక్కలు తారుమారు అవ్వడం ఖాయం అనే చర్చ జోరుగా జరుగుతోంది.


Next Story

Most Viewed