మాకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది.. బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

by Disha Web Desk 5 |
మాకు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది.. బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
X

దివ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో జంపింగ్ ల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లోని కీలక నేతలంతా పార్టీని వీడి కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే హస్తం పార్టీ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ నేతలు సూచనలు చేస్తున్నారు. మాకు పట్టిన గతే కాంగ్రెస్ నేతలకు కూడా పడుతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఇతర పార్టీల నుంచి నేతలు వలసలు రావడంతో తమలో తమకే గ్రూప్ తగాదాలు మొదలై, పార్టీలో ఒకరితో మరొకరు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది.

అలాంటి పరిస్థితే కాంగ్రెస్ నాయకులకు కూడా పట్టబోతుందని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇటీవల పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారికే టికెట్లు కూడా కేటాయిస్తున్నారని, కాంగ్రెస్ లోని కీలక నేతల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తొంది. చేరికల వేళ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ తగాదాలు, టికెట్ల విషయంలో అలకలు మొదలయ్యాయని వార్తలొస్తున్న నేపధ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా ఆసక్తిగా మారింది.

బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటోననే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ లోకి వలసలు వచ్చినప్పుడు శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారలేక గ్రూప్ తగాదాలతో, పార్టీలో తమకు జరిగిన అనుభవాలనే గుణపాఠాలుగా చెబుతున్నారా? లేక కీలక నేతలంతా పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోందనే భయంతో, ఇకపై పార్టీ మారాలనుకునే నేతలకు.. అక్కడికి వెళ్లినా ఒకప్పటి మన గతే పడుతుందని ముందుగానే హెచ్చరించి, పార్టీని వీడకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారా? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


Next Story