ఎమ్మెల్యేలు VS ఎమ్మెల్సీలు.. ఆరు స్థానాల్లో ట‌గ్ ఆఫ్ వార్‌

by Disha Web Desk 6 |
ఎమ్మెల్యేలు VS ఎమ్మెల్సీలు.. ఆరు స్థానాల్లో ట‌గ్ ఆఫ్ వార్‌
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సెగ్మెంట్లపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు క‌న్నేస్తున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 12 పూర్తిస్థాయి నియోజ‌క‌వ‌ర్గాలుండ‌గా ఆరు చోట్ల ఐదుగురు ఎమ్మెల్సీలు పోటీ ప‌డుతుండ‌టం విశేషం.

భూపాల‌ప‌ల్లిలో చారి వ‌ర్సెస్ గండ్ర‌..

భూపాలపల్లిలో బీఆర్ఎస్ ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా తయారైంది వ్యవహారం. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత బీఆర్ఎస్ గూటికి చేరుకున్న గండ్ర‌కు, గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓట‌మి పాలైన తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి మ‌ధ్య టికెట్ వార్ జ‌రుగుతోంది. 2014 ఎన్నికల్లో సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. కానీ 2018 ఎన్నికల్లో ఓడిపోయారాయన. మ‌ళ్లీ భూపాల‌ప‌ల్లి రాజ‌కీయాల్లో యాక్టివ్ రోల్‌కు వ‌చ్చేశారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ల్లెల‌ను చుట్టొస్తున్న మాజీ స్పీక‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని కూడా అనుచ‌రుల‌తో వ్యాఖ్య‌ానిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

డోర్న‌క‌ల్, మానుకోట‌ల‌పై స‌త్య‌వ‌తి క‌న్ను..

డోర్నకల్ నియోజకవర్గంపై సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ ఇద్దరు ఆశలు పెట్టుకున్నారు. నువ్వా? నేనా? అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారు. డోర్నకల్ అసెంబ్లీ టికెట్ మళ్లీ తనదేనని, తాను మళ్లీ పోటీ చేసి గెలిచే తీరుతానని రెడ్యానాయక్ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో డోర్న‌క‌ల్‌లో అవ‌కాశం రాకుంటే మ‌హ‌బూబాబాద్ నుంచైనా పోటీ చేయాల‌ని ఆమె భావిస్తుండ‌టంతో శంక‌ర్‌నాయ‌క్‌కు సీటుకు ఎస‌రు రాబోతోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

వ‌రంగ‌ల్ తూర్పు నుంచి సార‌య్య‌..

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌న్న చ‌ర్చ ఆ పార్టీలో జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య ఆ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలే చేస్తున్న‌ట్లు స‌మాచారం.

జ‌న‌గామ నుంచి పోచంప‌ల్లి..

జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై తీవ్ర‌మైన భూ క‌బ్జా ఆరోప‌ణ‌లున్న నేప‌థ్యంలో ఈసారి ఆయ‌న‌కు ఇవ్వకుండా ఎమ్మెల్సీ పోచంప‌ల్లిని బ‌రిలో దింపుతార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే ముత్తిరెడ్డి దీన్ని ఖండిస్తూనే పోచంప‌ల్లి వ‌ర్గీయుల‌ను ఆయ‌న దూరం పెడుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఎమ్మెల్యే టికెట్‌ తనదేనని యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు.

స్టేషన్ ఘన్ పూర్ పై కడియం దృష్టి..

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి తరచూ పర్యటిస్తూ.. తన క్యాడర్ ను సమాయత్తం చేసుకుంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని రాజయ్యపై విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఘన్ పూర్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కడియం పాల్గొంటున్నారు. దీంతో రాజయ్య కడియంపై గుర్రుగా ఉన్నారు.


Next Story

Most Viewed