నర్సంపేటలో మట్టి దందా.. రాత్రిపగలు తేడాలేకుండా తరలింపు

by Dishafeatures2 |
నర్సంపేటలో మట్టి దందా.. రాత్రిపగలు తేడాలేకుండా తరలింపు
X

దిశ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణ వ్యాప్తంగా మట్టి దందా జోరుగా సాగుతోంది. అధికారుల అలసత్వమో లేక మట్టి వ్యాపారుల ధైర్యమో వెరసి పట్టణ వ్యాప్తంగా మట్టి దందా నిరాటంకంగా కొనసాగుతున్నది. ఓవైపు అసైన్డ్ భూముల్లో అక్రమ వెంచర్లు వెలుస్తుండగా ఇదే క్రమంలో మరోవైపు మట్టి దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. ప్రధానంగా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు, మల్లంపల్లి రోడ్డు, పాకాల రోడ్డులో కొందరు నాయకులు అసైన్డ్ భూముల్లో హద్దులు వేసి ప్లాట్లు చేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పట్టణంలో భూములకు విపరీతంగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో సామాన్యుడి ఇంటికలను క్యాష్​ చేసుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. వీరి దందా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా కొనసాగుతున్నది. పట్టా భూముల్లో, కాల్వ కట్టల వెంబడి రోడ్డు సౌకర్యం లేకున్నప్పటికీ అన్ని రకాల అనుమతులు ఇస్తూ అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అసైన్డ్ భూముల్లో సైతం ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. రియల్టర్లకు దాహానికి అడ్డే లేకుండా పోయింది. దీనికి తోడు పట్టణంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న వెంచర్లలో మట్టికి డిమాండ్ ఏర్పడింది. స్థానికంగా ఉన్న కొందరు చోటామోటా నాయకులు మట్టి దందాలోకి దిగి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో మట్టిని తవ్వుతూ వ్యాపారం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ రాకపోగా రవాణాతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. చెరువులు, కుంటల్లో ఏర్పడిన గుంతలతో ప్రమాదం సైతం నెలకొంది. పట్టణంలోని ఒకటో వార్డులో పట్టపగలే టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. కాలనీ గుండా వాహనాలు వేగంతో వెళ్తుండడంతో ప్రజలు ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాక్టర్ల ద్వారా పట్టణం ప్రధాన రహదారి గుండా మట్టిని తరలిస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాదన్నపేట రోడ్డులో అసైన్డ్ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేయగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఒకటో వార్డు పరిధిలో 30 గుంటల్లో మట్టిని పోసి చదును చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు.

భరించలేనంతగా మట్టి భారం..!

నర్సంపేట పట్టణానికి సమీపంలోని చెరువులు, కుంటల నుంచి పరిమితికి మించి మట్టిని తోడేస్తుండటంతో మృత్యు కేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి పట్టణంలోని పలు కాలనీలకు తరలిస్తున్న మట్టికి అధిక ధర వసూలు చేస్తున్నారు. ఒక్కో టిప్పర్ (పది చక్రాలు)లో తరలించే మట్టికి రూ.5500, చిన్న టిప్పర్ కు రూ.2500 వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ కు రూ.800-1000 వరకు వసూలు చేస్తున్నారు.

అక్రమ వెంచర్లకు ఈ మట్టే..

నర్సంపేట పట్టణ శివారుల్లో కొన్ని నెలలుగా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఆ భూములను లెవల్ చేయడానికి అవసరమైన మట్టికోసం వీరిని ఆశ్రయిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా చెరువులు, కుంటలను తోడేస్తూ మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. చోటా మోటా నాయకుల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుండటంతో కాలనీవాసులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

అధికార పార్టీ నేత ఆగడాలు..

అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 111లో 30 గుంటల్లో అధికార పార్టీ నేత వెంచర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాదన్నపేట చెరువు ప్రాకారంలో నర్సంపేట శివారులో కాలువ గట్టు పక్కన వెంచర్ ఏర్పాటు చేసి ఆ స్థలానికి అక్రమంగా మట్టిని పెద్ద మొత్తంలో తరలించారు. అధికార పార్టీ నేత కావడంతో ఏ అధికారి నోరు మెదపని పరిస్థితి దాపురించింది.

ఇకనైనా స్పందిస్తారా..?

నర్సంపేట పట్టణంలో రాత్రి పగలు జరుగుతున్న మట్టి దందాపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంతో అసహనానికి గురవుతున్నారు. పట్టణ వీధుల్లో టిప్పర్లు యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టింపు ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. రాత్రిళ్లు వేగంగా నడిచే వాహనాలతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ మట్టి దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed