చెల్లని చెక్కులు పంచిన రాజయ్య.. ఎమ్మెల్యేపై మండిపడుతోన్న లబ్ధిదారులు

by Disha Web Desk 19 |
చెల్లని చెక్కులు పంచిన రాజయ్య.. ఎమ్మెల్యేపై మండిపడుతోన్న లబ్ధిదారులు
X

దిశ, వేలేరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గడువు ముగిసిన చెక్కులు లబ్దిదారులకు అందజేయడంతో ఆ చెక్కులు చెల్లవంటూ బ్యాంకు అధికారులు తిప్పి పంపిన ఘటన వేలేరు మండల కేంద్రంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం ఎమ్మెల్యే రాజయ్య వేలేరు మండల కేంద్రంలో జాతీయ పంచాయతీ పురస్కారాలను ఆయా గ్రామ పంచాయతీలకు అందజేసే కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను కూడా పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కులు తీసుకుని శుక్రవారం స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు వెళ్లారు.

బ్యాంకు అధికారులు చెక్కులను పరిశీలించి గడువు ముగిసిన చెక్కులు ఇచ్చారని గుర్తించి వాటిని తిరిగి లబ్దిదారులకు ఇచ్చేశారు. దీంతో లబ్ధిదారులు చెక్కులతో శుక్రవారం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. గడువు ముగిసిన చెక్కులు అందజేసి తమను ఇబ్బందులకు గురి చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల కింద మంజూరు అయితే తీరా సమయం అయిపోయిన తర్వాత తమకు చెక్కులు ఇచ్చి ఫొటోలకు పోజులు ఇచ్చారని అధికారులు, ప్రజాప్రతినిధులపై లబ్ధిదారులు మండిపడ్డారు.



Next Story

Most Viewed