దారికోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం..

by Disha Web Desk 20 |
దారికోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం..
X

దిశ, పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని అప్పాజీపేట గ్రామానికి రోడ్డులేక 30సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు, పాలకులు మారినా ఈ గ్రామ స్థితిగతి మారడం లేదు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం బాగుండాలి. కాని నేటికి మారుమూల గ్రామంలో రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయింది. వర్షాకాలం వస్తే మండలానికి వెళ్లాలంటే రోడ్డే ఉండదు. ఎటు వెళ్లాలో తెలియక పక్కగ్రామం బోడయిగూడెం నుండి 4కిలోమీటర్ల దూరం నుండి తిరిగివస్తే గ్రామపంచాయతీ పలిమెల వస్తుంది. ఆరకిలోమీటర్ దూరం ప్రయాణంలోనే గ్రామపంచాయతీ ఉంది. ఈ ఆమ్లెట్ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

గ్రామాన్ని చెరువు వేరుచేస్తుంది చెరువుకు మత్తడి లేక వర్షకాలం వరద ప్రభావం, కట్టపైనా రోడ్డు ఇరువైపుల వెడల్పులేక తెలికపాటి వర్షం కురిస్తే దారి బురమయంగా మారి గుంతలు పడి ప్రయాణం చేయడానికి నరకయాతన పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బురద రోడ్ల పై కాలి నడక కూడా సాగడం లేదు వాహనాలు దెబ్బతినడం, గుంతల్లో ఇరుక్కుపోవడం, అత్యవసర అనారోగ్య సమయాల్లో హాస్పిటల్ కు సైతం వేళ్ళలేని దుస్థితి నెలకొంటుంది. దీంతో ఏకంగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కావాలంటూ గ్రామస్తులు అధికారులను పాలకులను విన్నవించుకున్నారు.

రోడ్లు లేక ఇబ్బందుల్లో గ్రామస్తులు..

గ్రామంలో 30 ఇండ్లు 180 మంది నివాసముంటున్నారు. పెద్ద గ్రామపంచాయతీ పలిమెలకు ఆమ్లెట్ గ్రామం అప్పాజీపేటకు రోడ్డుసౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామప్రజలు వర్షాకాలం వస్తే మండలంకు వెళ్లాలంటే రోడ్డు లేక అడవి దారితో, ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..

సరైన రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో నిత్యావసర కోసం మండలానికి రావాలంటే వృద్దులు, పిల్లలు, వికలాంగులు నరకయాతన పడుతున్నారు. అత్యవసర సమయాల్లో వాహనం వచ్చే పరిస్థితి లేక ఎడ్లబండి, ప్రైవేటు వాహనాల్లోనో వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బోడయిగూడెం, అప్పాజీపేట గ్రామాల మధ్య సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు సరిపడలేవని మధ్యలోనే అపేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed