వేల్పుకొండ వెంకటేష్‌కు డాక్టరేట్

by Dishanational1 |
వేల్పుకొండ వెంకటేష్‌కు డాక్టరేట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం- కరపత్ర సాహిత్యము అనే అంశం పై ఆచార్య సూర్యధంజయ్ పర్యవేక్షణలో వేల్పుకొండ వెంకటేష్ చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు పీహెచ్ డీ పట్టాను అందజేశారు. కరపత్ర సాహిత్యం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. వివిధ ఉద్యమాల ప్రచారానికి కరపత్రమే ఆధారమైంది. ఫ్రెంచి విప్లవం మొదలుకుని భారతదేశ స్వతంత్ర పోరాటం వరకు కరపత్రం ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రధాన భూమికను పోషించింది. తెలుగు నేలమీద కరపత్ర రచన ఒక సాహిత్య ప్రక్రియగా మారింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం, వివిధ అస్థిత్వ ఉద్యమాల సందర్భంలో కరపత్రం పోషించిన పాత్రను మనము విస్మరించలేము. కానీ ఇంతటి ప్రాధాన్యం కలిగిన కరపత్ర సాహిత్యంపైన ఇప్పటి వరకు ఒక్క పరిశోధన కూడా జరగలేదు. ఈ లోటును పూరించడం కోసం వేల్పుకొండ వెంకటేష్ అనే పరిశోధకుడు పూనుకుని ఆరు సంవత్సరాలపాటు శ్రమించి కరపత్ర సాహిత్యాన్ని సేకరించి పరిశోధన పూర్తి చేశాడు.

అయితే, కరపత్రాన్ని ముద్రించి ఆ తర్వాత మరచిపోవడం అన్ని ఉద్యమ సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ విధంగా విస్మరణకు గురైన వివిధ రకాల కరపత్రాలను సేకరించి, విశ్లేషించి క్రమ పద్ధతిలో వెంకటేష్ పరిశోధన చేశాడు. తెలంగాణ ఉద్యమంలో స్వయంగా ఈ పరిశోధకుడు పాల్గొని రాష్ట్రం సిద్ధించాక పరిశోధనలు పూర్తి చేయడం సంతోషించదగిన విషయం. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, చీకటాయపాలెం గ్రామంలో పేద, దళిత కుటుంబంలో తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటయ్యలకు ఐదుగురు సంతానంలో మొదట పుట్టిన వేల్పుకొండ వెంకటేష్ డాక్టర్ పట్టా పొందడం ఈ ప్రాంతానికి గర్వకారణమని ప్రొఫేసర్స్, గురువులు, గ్రామ ప్రజలు, స్నేహితులు వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.



Next Story

Most Viewed