అడవికి అంకితం.. సిరిపెల్లి జీవితం..

by Disha Web Desk 23 |
అడవికి అంకితం.. సిరిపెల్లి జీవితం..
X

దిశ,చిట్యాల: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ రావు ఉద్యమ జీవితం ముగిసింది. చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర జిల్లా చోటే బైధీయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్పర్ అడవులలో గల మాద్ ప్రాంతంలో మంగళవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో సుధాకర్ మృతి చెందినట్లు తెలియడంతో చల్లగరిగ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిరిపెల్లి ఓదేలు రాజ పోచమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కాగా సుధాకర్ స్థానికంగా 9వ తరగతి చదువుతున్న సమయంలో అప్పుడున్న పీపుల్స్ వార్ (ప్రస్తుతం మావోయిస్టు పార్టీ) సిద్ధాంతాలకు ఆకర్షితుడై సానుభూతిపరుడు గా పనిచేసేవారు. తన చిన్నమ్మ కుమారుడు కలికోట శంకర్ అప్పటికే పీపుల్స్ వారులో చురుగ్గా ఉన్నారు. దీంతో శంకర్రావు కూడా 1997-98 లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుండి శంకర్రావు స్వగ్రామానికి రాలేదని స్థానికులు చెబుతున్నారు.

సుధాకర్ తండ్రి ఓదేలు 15 ఏళ్ల కిందట మృతి చెందాడు. ఇక సోదరి రాజేశ్వరి ఆమె భర్త మృతి చెందడంతో వారి కుమార్తె కుమారుడిని సుధాకర్ తల్లి రాజ పోచమ్మ పోషిస్తుంది. మనవడు హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రాజ పోచమ్మ చల్లగరిగలో ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. సుధాకర్ మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడన్న వార్త తెలియడంతో రాజ పోచమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

స్నేహితునితో పయనం..

చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్, రౌతు విజేందర్ స్నేహితులు. సుధాకర్ అన్న కలికోట శంకర్ పీపుల్స్ వార్ లో పనిచేస్తుండడంతో మీరు కూడా అటువైపు ప్రయాణించి 1996 -98లో వరంగల్ సెంట్రల్ జైలు జీవితం గడిపారు. 2000 సంవత్సరంలో సుధాకర్ విజేందర్ పూర్తిస్థాయిలో దళసభ్యులుగా ఉద్యమ జీవితాన్ని ప్రారంభించగా విజేందర్ అలియాస్ శ్రీను ఐదేళ్ల కిందట ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సుధాకర్ నిజామాబాద్ జిల్లా ఏరియా జిల్లా కమిటీ సభ్యుడిగా అనంతరం శంకర్ పేరుతో చత్తీస్గడ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నట్లు సమాచారం.

అడవికి అంకితమైన సుధాకర్ ప్రస్థానం..

తొమ్మిదో తరగతి నుండి పయనమైన సుధాకర్ నేటికీ దాదాపు 20 ఏళ్ల ఉద్యమంలో అనేక పోరాటాలు చేస్తూ ఉద్యమంలో చురుగ్గా పని చేస్తూ వివిధ హోదాల్లో పనిచేశారు. కాల్పర్ జరిగిన ఎన్ కౌంటర్ లో సుధాకర్ ప్రస్థానం మంగళవారంతో ముగిసింది.

సుధాకర్ భార్య కూడా మృతి..

సుధాకర్ భార్య ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు. దా సర్వర్ సుమన అలియాస్ రజిత మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

చల్లగరిగ గ్రామం నుండి..

చల్లగరిగ గ్రామం నుండి ముగ్గురు మావోయిస్టు నేతలు ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. గతంలో కలికోట శంకర్ 1996లో భూపాలపల్లి ఏరియా లో జరిగిన ఎన్ కౌంటర్ లో రౌతు విజేందర్ ఐదేళ్ల కిందట తాజాగా సిరిపెల్లి సుధాకర్ మృతితో ఉద్యమ నేపథ్యం ముగిసింది.

తల్లిని విడిచిన సుధాకర్..

ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన తల్లి కాటికి దగ్గరవుతున్న కడసారైనా సుధాకర్ నాకోసం వస్తాడని ఎదురు చూసిన తల్లికి చివరికి కొడుకే తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చిందని తల్లి రోదిస్తుంటే గ్రామంలోని ప్రజలు ఇరుగు పొరుగు వారు విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed