కోట్ల వ్యయంతో నిర్మాణం.. మౌలిక వసతులు మరిచిన అధికారులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

by Disha Web Desk 11 |
కోట్ల వ్యయంతో నిర్మాణం.. మౌలిక వసతులు మరిచిన అధికారులు.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో నామలపాడు పంచాయతీ పరిధిలో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు కొనసాగించారు. 28 డిసెంబర్ 2022 న భద్రాచలం కొత్తగూడెం జిల్లా అధికార కార్యక్రమంలో భాగంగా భారత రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా వర్చువల్ వెబ్ సైట్ ద్వారా ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఇతర సిబ్బందితో కలిపి సుమారు 300 మంది ఉంటున్నారు. నీటి కొరతతో కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి దాపరించింది. విద్యార్థులు మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన పరిస్థితి. ఏకలవ్య పాఠశాలను ఆర్భాటంగా ప్రారంభించి విద్యార్థులకు కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

మిషన్ భగీరథ నీరే దిక్కు..

ఏకలవ్య పాఠశాలకు మిషన్ భగీరథ నీరు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వస్తుంది. పాఠశాల ప్రాంగణంలో బోర్ వెల్ ఉన్నా దానిలోని నీరు బొగ్గుతో కలుషితంగా ఉండటంతో నిర్మాణాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాగా సమారుగా 300 ల మందికి వంట వార్పు, ఇతర అవసరాలకు రోజు వారి నిమిత్తం 10 వేల లీటర్ల నీరు అవసరం ఉండగా, మిషన్ భగీరథ నీరు వెయ్యి లీటర్లు మాత్రమే వస్తుండడంతో పరిస్థితి జఠిలమైంది. ఇక మూత్రశాలల్లో నల్లాలు ఉన్నా వాటి ద్వారా నీరు మాత్రం రాదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయమై ఏకలవ్య రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ రవిని వివరణ కోరగా పాఠశాలలో మిషన్ భగీరథ నీటిపై ఆధారపడి ఉండటంతో నీటి ఇబ్బంది మాట వాస్తవమేనని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story

Most Viewed