గ్యాస్ స్టవ్ రిపేర్ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్

by Disha Web Desk 11 |
గ్యాస్ స్టవ్ రిపేర్ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్
X

దిశ, హనుమకొండ టౌన్: గ్యాస్ స్టవ్ రిపేర్ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నిందితుడితో పాటు చోరీ సొత్తును తాకట్టు పెట్టుకున్న మరో ఇద్దరు నిందితులను సీసీఎస్, దామెర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు రెండు లక్షల ఇరువై వేల రూపాయల విలువ గల 21.5 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి ఆభరణాలు, 15వేల ఎనిమిది వందల నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి క్రైమ్స్ ఏసీపీ డేవిడ్ రాజు వివరాలను వెల్లడించారు.

జనగాం జిల్లా, రఘునాథపల్లి గ్రామం, ప్రస్తుతం హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న పర్వతం రాజు గత కొద్ది కాలంగా గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ గ్యాస్ స్టవ్ మరమ్మత్తులు చేస్తూ జీవించేవాడు. ఈ విధంగా వచ్చిన ఆదాయం తన జల్సాలతో పాటు, తన కుటుంబ పోషణకు సరిపోక పోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందు కోసం గ్యాస్ స్టవ్ మరమ్మత్తులో తనకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోని ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి వారి వద్దకు వెళ్లి సబ్సిడీలో గ్యాస్ సిలిండర్, స్టవ్ లను ఇప్పిస్తానని నమ్మించి, ఇందుకోసం ఆధార్ కార్డు కావాలని, ఆధార్ కార్డు కోసం ఇంట్లోకి వేళ్లే మహిళలను రహస్యంగా అనుసరించి వారి ఇంటిలో బంగారం, డబ్బు చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయేవాడు.

అలాగే గ్యాస్ స్టవ్ మరమ్మత్తు ముసుగులో గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీ చేసేవాడు. ఇదే నిందితుడు గత ఐదు సంవత్సరాలుగా రాచకొండ, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడటంతో నిందితుడిని పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సంవత్సరం జైలు నుంచి విడుదలయిన నిందితుడిలో ఎలాంటి మార్పు రాకపోగా మరోమారు చోరీ చేసేందుకుగా సిద్దమయినాడు.

ఇందుకోసం నిందితుడు ఈ నెల 2వ తేదీన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని కంఠాత్మకూర్ గ్రామంలో వృద్ధ మహిళను గ్యాస్ స్టవ్, సిలిండర్ ఇప్పిస్తానని నమ్మించి ఫోటో తీసుకుంటాను, మెడలో గొలుసును పక్కన పెట్టండి అని చెప్పడంతో సదరు వృద్ధురాలు తన మెడలోని గొలుసును తన ఇంటిలోని అలమారలో భద్రపర్చింది. ఇది గమనించిన నిందితుడు వృద్ధురాలిని సెల్ ఫోన్ లో ఫోటో తీసిన అనంతరం వృద్ధురాలిని గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకురావాలని అనే నెపంతో వృద్ధురాలి వెంట వెళ్లిన నిందితుడు అలమారలో భద్రపర్చిన బంగారు గొలుసు చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయినాడు.

ఇదే రీతిలో నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరు చోరీలకు పాల్పడగా, మరో ఏడు తాళం వేసివున్న ఇండ్ల తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, ధర్మసాగర్, రాయపర్తి పరిధిలో రెండు చొప్పున, దామెర, ఐనవోలు, దేవరుప్పులు, మామూనూర్ స్టేషన్ ఘన్ పూర్, ఖానాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున నిందితుడు చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు చోరీ చేసిన సొత్తును పోలీసులు అరెస్ట్ చేసిన రెండవ నిందితుడు ఆలేరు మండలం టంగుటూరు ప్రాంతానికి చెందిన చింతకింది రాములు ద్వారా యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి చెందిన గోవింద్ చౌదరి వద్ద తాకట్టు పెట్టి డబ్బు తీసుకొనేవాడు.

ఈ నేరాల అప్రమత్తమైన సీసీఎస్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు, క్రైమ్స్ డీసీపీ డి.మురళీదర్ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడిని గుర్తించడం జరిగింది. నిందితుడు మరో గ్యాస్ స్టవ్ మరమ్మత్తు పేరుతో దామెర ప్రాంతానికి వచ్చినట్లుగా సమాచారం రావడంతో దామెర క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో పట్టుకున్న పోలీసులు నిందితుడిని విచారించి నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగితా ఇద్దరు నిందితులను చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డీసీపీ మురళీధర్, ఏసీపీ డేవిదరాజు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, ఎస్ఐలు యాదగిరి, బాబురావు, ఏఎస్ఐ శివకుమార్, దామెర ఎస్ఐ రాజేందర్ హెడ్ కానిస్టేబుళ్లు అంజయ్య, రవికుమార్, వేణుగోపాల్, జంపయ్య, కానిస్టేబుళ్లు, చంద్రశేఖర్, వినోద్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.



Next Story

Most Viewed