బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ బర్బాత్‌!

by Disha Web Desk 12 |
బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ బర్బాత్‌!
X

దిశ, వరంగల్‌ టౌన్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ పాలనపై అంతులేని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా బల్దియా అధికారుల తీరు, పాలకుల వ్యవహారం మాత్రం మారడం లేదు. అక్రమాలు వెలుగు చూసినా, అవినీతి బట్టబయలైనా నిండ మునిగాక చలి ఉండదనే సామెతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యంగా GWMCలో టౌన్‌ప్లానింగ్‌ విభాగంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా తుడుచుకుపోతున్నారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

అసలు నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూల కేంద్రం ఈ విభాగమేననే విమర్శలు ఉన్నాయి. తాజాగా సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఆ విభాగంపైనే అధికమొత్తంలో వచ్చిన ఫిర్యాదులే అందుకు అద్దం పడుతున్నాయి. మొత్తం 87 అర్జీలు రాగా, అందులో 53 వినతులు టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి చెందినవంటే.. ఆ విభాగం విధి నిర్వహణపై అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారా? అవినీతికి పాచికలు సిద్ధం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధానంగా ఇంటినంబర్ల కేటాయింపు, ఇంటి నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలపైనే బల్దియా గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు ఎక్కువ మొత్తంలో అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాచరణ మొత్తం టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి చెందినదే కావడం ఆ అధికారుల పనితీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ సంపాదన కు అలవాటు పడి.. అక్రమార్కులతో చేయి కలిపి సామాన్య ప్రజానీకానికి కష్టాలు కలిగిస్తున్నారంటూ.. నగర వాసులు మండిపడుతున్నారు.

తమకు న్యాయం చేయాలని కోరినా.. ఉన్నతాధికారులు కప్పదాటు ముచ్చట్లతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. పాలకవర్గం కూడా అధికారులతో కుమ్మక్కై ప్రజల ఇబ్బందులను పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోవాలని, పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని లేదంటే ప్రత్యక్ష ఆందోళనలకు దిగాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.


Next Story

Most Viewed