'ఇచ్చిన హమీలు ప్రభుత్వం తీర్చలేదు.. మరో పోరాటానికి వీఆర్ఏలు సిద్ధమవ్వాలి'

by Disha Web |
ఇచ్చిన హమీలు ప్రభుత్వం తీర్చలేదు.. మరో పోరాటానికి వీఆర్ఏలు సిద్ధమవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం వీఆర్వోల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని వీఆర్ఏ జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం పటాన్ చెర్వు శ్రీనివాస్ ఫంక్షన్ హాల్‌లో జేఏసీ చైర్మన్ గడ్డం రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 28 వరకు ప్రభుత్వం వీఆర్ఏల సమస్యల పై స్పందించి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకుంటే 28న ప్రెస్ మీట్ పెట్టి వీఆర్ఏలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని జేఏసీ కమిటీ నిర్ణయించింది.

సీఎం అసెంబ్లీలో వీఆర్ఏ అందరికీ పే స్కేల్ ఇస్తామని, అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పిస్తామని, 55 ఏళ్ల వయసు పైబడిన వీఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి రెండు సంవత్సరాలు దాటిందని చైర్మన్ గడ్డం రాజయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు 80 రోజులు సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సమ్మె సందర్భంగా సుమారు 65 మందికి పైగా వీఆర్పీలు మరణించారని, మునుగోడు ఎన్నికల తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

సమ్మె విరమించి వంద రోజులు దాటిన ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ సమస్యల పరిష్కారానికై ప్రగతి భవన్‌లో కూర్చో పెట్టి మరొక రోజు పిలుస్తామని చెప్పి ఉత్త చేతులతో పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ కు మళ్ళీ పిలుస్తామని నెల రోజులు దాటినా నేటికీ ఎలాంటి పురోగతి లేని కారణంగా వీఆర్ఏ లంతా మరో పోరాటం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ రమేష్ బహదూర్, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదా మియా, కన్వీనర్ సాయన్న, కో- కన్వీనర్లు, వెంకటేష్ యాదవ్, ఎస్కే రఫీ, వంగూరు రాములు, గోవింద్, ఉమామహేశ్వరరావు రాజు, వివిధ జిల్లాల జాక్ చైర్మెన్లు కో చైర్మెన్లు సెక్రటరీ జనరల్స్, కన్వీనర్‌లు పాల్గొన్నారు.


Next Story