కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాంపల్లిలో బీజేపీ స్టేట్‌ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను మొదట ప్రొత్సాహించిందే బీఆర్ఎస్ అని అన్నారు. పార్టీలు మారే లీడర్లను కుక్కలు, నక్కలు అంటున్న కేసీఆర్.. నాడు ఆ కుక్కలు, నక్కలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడని అన్నారు. ఈ రెండు పార్టీలు ఒకటే అని.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు అని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు హరించివేశాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారని అన్నారు. ఇది ఆషామాషీ కేసు కాదని.. కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని అన్నారు.

ముఖ్యంగా ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ నేతల ఫోన్లే టార్గెట్‌గా ట్యాప్ చేశారని ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్‌కు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. నిందితుల నిర్ధారణ జరిగాక పరిణామాలు తీవ్రంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యం అని అన్నారు. ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి అని గుర్తుచేశారు. పదేళ్ల పాటు కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ఒక ప్రయివేట్ కంపెనీగా భావించి నిలువునా దోచుకున్నారని అన్నారు.

Next Story

Most Viewed