'ఉపాధ్యాయులందరికీ బదిలీల అవకాశం ఇవ్వాలి'

by Disha Web Desk 13 |
ఉపాధ్యాయులందరికీ బదిలీల అవకాశం ఇవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బదిలీల్లో ఉపాధ్యాయులు అందరూ దరఖాస్తు చేసుకునే విధంగా పాఠశాలలో కనీసం రెండు సంవత్సరాలు సర్వీస్ ఉండాలనే నిబంధనను సడలించాలని, ఉపాధ్యాయులందరికీ బదిలీకి అవకాశం ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. జీఓ 317 ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించబడిన టీచర్లను అన్ని ఖాళీలు చూపకుండా పాఠశాలల అవసరం పేరుతో మారుమూల పాఠశాలలు కేటాయించారని తెలిపారు.


ఇతర జిల్లాలకు అర్ధాంతరంగా బదిలీ కావడంతో స్టేషన్ సర్వీస్ పాయింట్లు కోల్పోయారని పేర్కొన్నారు. దివ్యాంగులు కూడా అననుకూల పాఠశాలల్లో నియమించబడ్డారని, ఇప్పుడు అందరికీ బదిలీ చేస్తూ తమకు మాత్రం అవకాశం ఇవ్వకపోవటం అన్యాయమని వారు ఆందోళన చెందుతున్నారని వివరించారు. వెబ్ కౌన్సెలింగ్ కాబట్టి జీరో సర్వీస్‌తో బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆర్థికంగా, పరిపాలన పరంగా గానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదని తెలిపారు. కాబట్టి అందరికీ బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed