టీఎస్‌ఆర్టీసీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. విశ్వాసాన్ని మరింత పెంచండి!

by Disha Web Desk 2 |
టీఎస్‌ఆర్టీసీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. విశ్వాసాన్ని మరింత పెంచండి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

“టీఎస్ఆర్టీసీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ప్రజలకు సంస్థకు మధ్య మీరు అనుసంధానకర్తల్లాగా వ్యవహారించబోతున్నారు. సంస్థపై ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచడంలో మీ వంతుగా కృషి చేయాలి. మన సంస్థ ప్రజలకు కల్పిస్తోన్న సౌకర్యాలను, వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం, తదితర అంశాలు ప్రజలకు చెప్పాలి. జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) పెంచేలా పాటుపడాలి. గ్రామాల్లోని ప్రజల రవాణా అవసరాలకు మీరే గుర్తు వచ్చే విధంగా వారితో మమేకమవ్వాలి. మిమ్ముల్ని అధికారులుగా గుర్తించి ఇచ్చిన ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు సమర్థవంతంగా నిర్వహించాలి. సంస్థను ప్రజలకు మరింతగా దగ్గర చేయడంలో మీ పాత్ర కీలకమనే విషయం మరిచిపోవద్దు” అని సజ్జనార్ అన్నారు.

ప్రజలతో మర్యాదగా మెలగాలని హితవు చెప్పారు. టీఎస్ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినేలా వ్యవహారించొద్దని, స్వీయ క్రమ శిక్షణ కలిగి ఉండాలని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ గతకొంత కాలంగా ఐటీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకుని టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలకు వివరించాలన్నారు. అంతేగాక, విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరించిన విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ గుర్తించి సత్కరిస్తుందని, ఈ ప్రోత్సహకాలను మోటివేషన్‌గా తీసుకుని మంచిగా పనిచేసి.. సంస్థ వృద్ధికి కృషి చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు.

Also Read...

ఉగ్రవాదులకు పాతబస్తీలో MIM స్థావరం కల్పిస్తోంది: బండి సంజయ్



Next Story

Most Viewed