గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' విడుదలపై TSPSC కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదలపై TSPSC కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష నిర్వహించింది. 503 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 (75%) మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 51, 931 మంది, ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా 1933 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొంది. త్వరలో ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఈ స్కానింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక 'కీ' పేపర్‌ను విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. 10.15 నిమిషాలకు సెంటర్ లోపలికి వెళ్లాలన్న రూల్‌ను అధికారులు కఠినంగా అమలు చేశారు. కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడ్డారు. అభ్యర్థులు పరీక్షా సెంటర్ల దగ్గర చివరి నిమిషంలో అభ్యర్థులు కాస్త గందరగోళానికి గురయ్యారు. కొన్ని సెంటర్ల దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడంలో ఆలస్యమైంది. ట్యాబ్‌లలో ఛార్జింగ్ లేకపోవడం, మరికొన్ని స్లోగా ఉండడంతో ఈ ప్రాసెస్ లేట్ అయింది. దీంతో బయోమెట్రిక్ తీసుకునే అభ్యర్థుల లైన్ పెద్దగా అవ్వడంతో కొన్ని సెంటర్లలో పరీక్ష గదిలో బయోమెట్రిక్ తీసుకోవాల్సి వచ్చింది. సిటీలో వర్షం కారణంగా కొందరు అభ్యర్థులు లేట్ అయ్యారు. మరికొందరికి సెంటర్ అడ్రస్‌లు దొరకకపోవడంతో ఆలస్యమయ్యారు. దీంతో వారందరినీ సెంటర్ అధికారులు వెనక్కి పంపారు. కొందరు అభ్యర్థులైతే కొన్ని సెకన్ల గ్యాప్‌తో ఎగ్జామ్ మిస్ అయ్యారు. గత పరీక్షల్లో 1 నిమిషం నిబంధన ఉండేదని, ఇప్పుడు 15 నిమిషాలు లేట్ రూల్ తీసుకొచ్చారని ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అంటున్నారు. తాము టైంకే వచ్చినా లోపలికి అనుమతించలేదని అబిడ్స్ స్టాన్లీ కాలేజ్ దగ్గర అభ్యర్థులు వాపోయారు.

Next Story