ప్రజా వ్యతిరేక బడ్జెట్.. ఏ వర్గానికి లాభం లేదు: TRS

by Web Desk |
ప్రజా వ్యతిరేక బడ్జెట్.. ఏ వర్గానికి లాభం లేదు: TRS
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఇది ప్రజా వ్యతిరేక.. కార్మిక వ్యతిరేక.. రైతు వ్యతిరేక.. ఉద్యోగుల వ్యతిరేక బడ్జెట్.. అంటూ టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో 2022-23 బడ్జెట్ పూర్తిగా పేదల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. వ్యవసాయ రంగానికి, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా, అదే క్రమంలో పెట్టుబడిదార్లుకు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ తన ప్రసంగంలో ఇది అమృత కాల్ బడ్జెట్ అన్నారనీ, అమృతం తాగితే ఎవరూ చనిపోరంటారనీ, కానీ, అన్ని ప్రభుత్వరంగ సంస్థలను చంపేస్తూ అమృత్ కాల్ అంటే ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి లబ్ధి కలగదని ఎంపీ నామా స్పష్టం చేశారు.

వ్యవసాయం చేసి రైతులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే, ఆ దిశగా కేంద్రం తీసుకున్న చర్యలమీ లేవని ఎంపీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అమృత్కాల్ బడ్జెట్ అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నారు. ఎయిర్ ఇండియాను అమ్ముకున్నారు. మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి లైన్లో పెట్టారని అన్నారు. ఇలాంటి బడ్జెట్ మీద గ్రామాల్లోని రచ్చబండ మీద కూడా చర్చ జరగాలని ఎంపీ నామా పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్‌లో కనీస మద్దతు ధరపై ప్రకటన వస్తుందని దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆశతో ఎదురుచూశారని, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం గురించి కూడా ఒక ప్రకటన వస్తుందని రైతులు, ప్రజలు ఎదురుచూశారని కానీ.. ఆ చర్చే లేకపోయిందని విమర్శించారు.

కరోనా కాలంలో అందరినీ బతికించింది వ్యవసాయ రంగమని, ఇలాంటి కీలక రంగం గురించి కేంద్రం బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో అన్యాయం జరిగిందన్నారు. గుజరాత్ గిఫ్ట్ సిటీ గురించి మాత్రం మాట్లాడుతున్నారని, దేశంలో గుజరాత్ తప్ప ఇంకో రాష్ట్రం లేదా? ఇంకో సిటీ లేదా? హైదరాబాద్‌తో పాటు ఇంకా ఏ రాష్ట్రంలో సిటీలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. తొమ్మిది రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు నిలబడి ఆందోళన చేయాల్సి వచ్చిందని, ఏ ఇబ్బందీ లేకుండా ధాన్యం సేకరణ చేశామని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. మొత్తం మీద కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఎంపీ నామా ఘాటుగా విమర్శించారు.



Next Story

Most Viewed