అబ్కారీ పోలీస్ ఆఫీసర్ ఏడుకొండలు బదిలీ.. కన్నీరు పెట్టిన నిరుద్యోగులు

by Disha Web Desk 2 |
అబ్కారీ పోలీస్ ఆఫీసర్ ఏడుకొండలు బదిలీ.. కన్నీరు పెట్టిన నిరుద్యోగులు
X

దిశ, పెద్దవూర: సాధారణంగా ఎక్కడైనా ఉపాధ్యాయులు బదిలీపైన వెళ్తుంటే విద్యార్థులు, గ్రామ ప్రజలు కన్నీరు పెట్టడం సాధారణం. కానీ, ఇక్కడ కాస్త భిన్నంగా జరిగింది. ఎక్సైజ్ సీఐ ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆ మండల నిరుద్యోగులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న ఏడుకొండలు బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో అక్కడి నిరోద్యోగులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే.. ఏడుకొండలు జిల్లాలో మంచి ఉద్యోగిగా పేరు పొందారు. తాను సంపాదించిన దానిలో ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగులకు సాయం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు “ది మిషన్” అనే సంస్థను స్థాపించి స్వయంగా తానే వారికి కోచింగ్ ఇచ్చారు.

ఒకవైపు సీఐగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ఖాళీ సమయంలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది నిరుద్యోగులకు సాయం చేశారు. దీంతో అనూహ్యంగా బదిలీ అయ్యి వెళ్లిపోవడాన్ని అక్కడి నిరుద్యోగ విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. ఏడుకొండలు స్వగ్రామం.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయినవానికుంటలో జన్మించారు. తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వ ఉద్యోగం పొందారు. తనలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పుడు సాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. మనకు ఉన్నంతలో కొంత ఇతరులకు పంచడంలో వచ్చే ఆనందం వెలకట్టలేనిదని, ఒకరి నుంచి తీసుకోవడం కాకుండా మనం ఏమివ్వగలం అనే ఆలోచన ఉన్నప్పుడే ప్రతిఒక్కరిలో మార్పు వస్తుందని తన తండ్రి బాల్‌నర్సయ్య మాటలు తనను కదిలించాయని.. అందుకే కొందరికైనా సాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.


Next Story