విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం ప్రమోషన్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Vinod kumar |
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం ప్రమోషన్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం ప్రమోషన్ నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో బుధవారం నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ ఉద్యోగుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నడుస్తున్న పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నామని, దేశంలోనే బెస్ట్ టూరిజం గా తెలంగాణ టూరిజం ను అభివృద్ది చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పర్యాటక శాఖ లాభాలబాట పట్టిందని పేర్కొన్నారు.

పర్యాటకులకు మెరుగైన సేవలు అందిస్తూనే 2022-23 సంవత్సరంలో రూ. 117 కోట్ల టర్నోవర్‌ సాధించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పర్యాటక శాఖ వార్షిక టర్నోవర్‌ సగటున రూ. 113 కోట్లు కాగా, గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ. నాలుగు కోట్లు అదనంగా టర్నోవర్‌ సాధించిందని అన్నారు.సీఎం కృషితోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు, భూదాన్‌ పోచంపల్లి గ్రామం ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైందన్నారు. సంస్ధ అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్ధి తో పనిచేయాలని సూచించారు. పర్యాటక శాఖకు చెందిన నిరుపయోగంగా ఉన్న పర్యాటక కేంద్రాలను వినియోగంలోకి తేవడానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

తెలంగాణ పర్యాటక శాఖకు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లీజులు తీసుకొని నిబంధనలు పాటించని, బకాయిలు చెల్లించని సంస్థలపై చర్యలు చేపట్టామని, ఉమ్మడి రాష్ట్రంలో లీజుల పేరుతో పర్యాటక శాఖ ఆస్తులను అనుభవిస్తున్న సంస్థలపై చర్యలు చేపట్టి ఇప్పటివరకూ రూ. 60 కోట్ల బకాయి వసూలు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఇంకా అనేక చారిత్రక నిర్మాణాలు యునెస్కో గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నాయని, వాటికి గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు.

20ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించి ఉంటే ఇంకా ఎంతో అభివృద్ధి జరిగేదన్నారు. తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోనూ తెలంగాణ టూరిజం వసతిగృహాలు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను పరిరక్షించడంతోపాటు తిరుపతి, విశాఖపట్నం, వారణాసి తదితర ప్రాంతాల్లో కూడా తెలంగాణ టూరిజం తరఫున వసతిగృహాలు, హోటళ్లు నిర్మించేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సంస్థ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఎండీ మనోహర్‌తోపాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed