నేడు పాలమూరుకు కేటీఆర్.. స్వాగతం పలుకుతున్న సమస్యలివే..!

by Disha Web Desk 4 |
నేడు పాలమూరుకు కేటీఆర్.. స్వాగతం పలుకుతున్న సమస్యలివే..!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: సమైక్య రాష్ట్రంలో... అధోగతి పాలైన పాలమూరు జిల్లా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అభివృద్ధి పరంగా ఓకే అనిపించే స్థాయిలో ఉన్న.. వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో సాగు నీరు రాకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానీకం నైరాశ్యంలో ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం.. పనులు కూడా నిలిచిపోవడంతో సాగునీరు వస్తుందా లేదా అన్న సందేహాలను ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానీకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలను, సంబంధిత అధికారులను ఆదేశించినప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేసే అంశంపై పలువురు ఇప్పటికీ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మొదట పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ జిల్లాలో ఉన్న కరువును, వలసలను రూపుమాపుతామని... ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల కన్నీటి గోస తీర్చేందుకైనా తెలంగాణ రాష్ట్రం కావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెబుతూ వచ్చారు.. మూడేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.. సరి కదా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రిజర్వాయర్లు, కాలువలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తప్ప ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల బతుకులు మెరుగుపడే పరిస్థితులు ఏమాత్రం లేవు.

ఉద్యోగ అవకాశాలు స్థానికులకే కల్పించాలి..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కంపెనీల అన్నింటిలోనూ స్థానికుల కంటే... స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారు. పోలేపల్లి సెజ్, బాలనగర్ తదితర ప్రాంతాలలో ఉన్న కంపెనీలలో ఎక్కువ శాతం స్థానికేతర్లే ఉన్నారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత కొంతమంది ఉద్యోగాలు రాక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లగా, మరి కొంతమంది కూలీ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో పాలమూరు జిల్లా కేంద్రంలో నేడు ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఐటీ కారిడార్‌లో, అమర రాజా కంపెనీలోను ఉండే ఉద్యోగాల ఖాళీలను స్థానికులతో భర్తీ చేయాలి అని నిరుద్యోగులు కోరుతున్నారు.

మరిన్ని రోడ్లు కావాలి

మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో మెరుగైన ఫలితాలని సాధించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు అభివృద్ధి విషయంలో చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇచ్చింది. మహబూబ్ నగర్ -జడ్చర్ల-భూత్పూర్ మధ్య ప్రభుత్వం మెడికల్ కళాశాల, ఐటీ కారిడార్ తదితరాలు నిర్మాణం జరుపుకుంటున్న నేపథ్యంలో జాతీయ రహదారి నుంచి, మహబూబ్ నగర్ పట్టణంలోని పలు రోడ్ల వరకు అదనంగా రోడ్లను నిర్మిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. పాలకులు సాగునీరు-నిరుద్యోగ సమస్య పరిష్కారం, రోడ్ల నిర్మాణం కోసం చర్యలు చేపట్టడం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాను మరింత అభివృద్ధి చెందితే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మంత్రి కేటీఆర్ పర్యటన ఇలా..

-ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 11 గం.కు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దివిటిపల్లి ఐటీ టవర్ వద్దకు చేరుకుంటారు.

-11 గంటల నుంచి.. 12:30 గంటల వరకు ఐటీ టవర్ ప్రారంభోత్సవం, అమర రాజా బ్యాటరీ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

-మధ్యాహ్నం 1 గం. నుంచి 2.30. మధ్య మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

-మధ్యాహ్నం 2.30 నుంచి మూడు గంటల వరకు భోజన విరామ సమయం

-మధ్యాహ్నం 3. 15 నిమిషాల నుంచి సాయంత్రం 4.30 గం.వరకు పట్టణంలోని పలు జంక్షన్లు, శిల్పారామం ప్రారంభోత్సవం, కేసీఆర్ ఏకో పార్కులో క్లాక్ టవర్ ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మందికి పైగా పోలీసులతో ఎస్పీ నర్సింహ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More: రైతులకు సర్కార్ శుభవార్త.. ఎకరానికి రూ.10 వేలు డేట్ ఫిక్స్


Next Story