నేడు తొలిసారి ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. 20 అంశాలపై చర్చ

by Disha Web Desk 2 |
నేడు తొలిసారి ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. 20 అంశాలపై చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరనున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని వివరించనున్నది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థికపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక పరిస్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని రిక్వెస్టు చేయనున్నది. ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టున్నట్టు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనున్నట్టు టాక్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో పెరిగిపోయిన అప్పులతో పాటు ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ అంశాన్ని వివరించి ఏదో ఒక రూపంలో రిలీఫ్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను సైతం ఈ సమావేశంలో ప్రధానితో చర్చించనున్నారు.

దాదాపు 20 అంశాలు..

ఈ సమావేశంలో దాదాపు ఇరవై అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేలా వివిధ శాఖల అధికారులు జాబితాను సిద్ధం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లతో పాటు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రావాల్సిన నిధుల గురించి రాతపూర్వకంగా వివరించనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఫండ్స్ రిలీజ్ కోసం హామీ ఇచ్చినా.. అవి అందలేదనే విషయాన్ని ప్రస్తావించనున్నారు. రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎదురవుతున్న చిక్కులను దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ విషయం ప్రస్తావన..

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం, విధ్వంసం జరిగిందని సీఎం, డిప్యూటీ సీఎం అసెంబ్లీ వేదికగా ఫైర్ అయ్యారు. వైట్‌పేపర్‌పై చర్చ సందర్భంగా పలు కామెంట్స్ చేశారు. వీటిలో కొన్నింటిని ప్రధానికి వివరించే చాన్స్ ఉన్నది. ఏయే రంగంలో ఎలాంటి మిస్‌మేనేజ్‌మెంట్ జరిగిందో గణాంకాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తక్షణావసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించడంతో పాటు గ్రాంట్లను సకాలంలో విడుదల చేయాలని ప్రత్యేకంగా కోరే అవకాశమున్నది. వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రాకుండా నిలిచిపోయిన ఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఉదాహరణలతో వివరించే చాన్స్ ఉన్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత పెట్టడం ద్వారా అన్యాయం జరిగిందనే అంశాన్ని వివరించడంతో పాటు వాటిని చక్కదిద్దాలనే ప్రతిపాదనను ప్రధాని ముందు ఉంచే అవకాశమున్నట్టు సచివాలయ వర్గాల సమాచారం. గతంలో నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు తెలంగాణకు వివిధ స్కీముల (మిషన్ భగీరథ, కాకతీయ లాంటివి) ద్వారా నిధులను కేంద్రం నుంచి ఇప్పించేలా ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినా అవి మెటీరియలైజ్ కాలేదనే అంశాన్ని కూడా వివరించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర ప్రభుత్వ పథకాల (సీఎస్ఎస్) కోసం తెలంగాణకు రావాల్సిన వాటా పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. ఈ విషయంపై అప్పట్లో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. దీనిని సైతం పీఎంకు గుర్తుచేయనున్నారు.

సీఎస్టీ అంశం ప్రస్తావనకు..

దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉనికిలోకి రాకపూర్వం తెలంగాణకు రావాల్సిన సీఎస్టీ (సెంట్రల్ సేల్స్ టాక్స్) బకాయిల అంశాన్నీ పీఎం వద్ద ప్రస్తావించనున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా దానికి అవసరమైన నిధుల విడుదలలో జాప్యం జరుగుతునన్నది. ఈ విషయాన్ని ప్రధానికి గుర్తుచేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఉత్సవాలకు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరే అవకాశమున్నది. మొత్తం ఇరవై అంశాలకు సంబంధించిన మెమొరాండంలను తొలి భేటీలోనే ప్రధానికి అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. మర్యాదపూర్వకంగా జరిగే తొలి భేటీలో రాష్ట్ర అంశాలపై చర్చ ఎంతసేపు జరిగిందనేదానికన్నా అన్నింటినీ ఆయన ప్రధాని తీసుకెళ్లేందుకు రెడీ అయింది.

జాతీయ రహదారులకు రిక్వెస్టు

రాష్ట్రంలో గడిచిన పదేండ్లలో కొన్ని కొత్త జాతీయ రహదారులు వచ్చినా స్టేట్ హైవేస్‌గా ఉన్న రోడ్లను నేషనల్ హైవేస్‌గా గుర్తించే ప్రతిపాదనలను ప్రధాని దృష్టికి ఈ సమావేశంలో తీసుకెళ్లే చాన్స్ ఉన్నది. దీని ద్వారా రోడ్ కనెక్టివిటీ పెరగడంతో పాటు రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందనేది ప్రధాన ఉద్దేశం. దీనికి తోడు విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య పదేండ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రధానికి సీఎం గుర్తుచేయనున్నారు. ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌ను రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో విభజన చేసేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరనున్నారు. గత ప్రభుత్వంలో ఏయే పథకాల కింద ఫండ్స్ రిలీజ్‌కు ఇబ్బంది ఏర్పడిందో వాటిని ఏకరువు పెట్టి వీలైనంత తొందరగా విడుదల చేయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత పలు అంశాల విషయమై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం, డిప్యూటీ సీఎం విడిగా భేటీ కానున్నారు. ప్రధానితో చర్చించిన అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నది. సమయాన్ని బట్టి పలువురు కేంద్ర మంత్రులతోనూ వీరిద్దరూ సమావేశం కావచ్చని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story