శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురి అరెస్ట్!

by Disha Web Desk 5 |
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురి అరెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని నిందితులుగా పరిగణిస్తూ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ కొనసాగింపులో భాగంగా ఆయన బందువులైన గోదావరి సత్యనారయణ, పెంట భరత్ కుమార్, పెంట భరణి కుమార్ లను ఏసీబీ అరెస్ట్ చేసింది. శివబాలకృష్ణ ఆస్తులు కూడబెట్టడంలో ఈ ముగ్గురు సహకరించారని, వీరు ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులు తమ పేర్లపై నమోదు చేసుకొని ఆయనకు బినామీలుగా ఉన్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ ముగ్గురి నిందితులని నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో హజరు పర్చగా.. వారికి 14 రోజుల జ్యూడిషయల్ రిమాండ్ ను విధించారు. అనంతరం ఈ ముగ్గురిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా అక్రమ మార్గంలో సంపాదించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసు విచారణలో తన బందువులు, సన్నిహితుల పేరుతో విలువైన భూములు రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తించిన ఏసీబీ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 250 కోట్లకు పైనే ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది.



Next Story

Most Viewed