ప్రభుత్వ ఆస్పత్రుల్లో దొంగల హల్‌చల్! అవే వారి టార్గెట్

by Disha Web Desk 4 |
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దొంగల హల్‌చల్! అవే వారి టార్గెట్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులు, వారి సహాయకుల భద్రత డొల్లగా మారింది. వేల సంఖ్యలో రోగులు వస్తుండగా వీరిలో ఎవరు రోగులు, ఎవరు దొంగలో గుర్తించలేకుండా పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ మహా నగరంలో పేద రోగుల కోసం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కోఠి, పేట్లబుర్జు, ఈఎన్టీ, సరోజినీ, కింగ్ కోఠి జిల్లా దవాఖాన ఇలా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో తరచుగా ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటునే ఉన్నాయి.

వీటిల్లో దొంగతనాలు సాధారణంగా మారగా గతంలో అత్యాచారాలు సైతం జరిగాయి. రాష్ట్రంలోనే పేరున్న ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందిన గాంధీ ఆస్పత్రిలో సుమారు రెండేళ్ల క్రితం రోగి సహాయకులుగా ఉన్న ఇద్దరు అక్కాచెల్లెల్లపై హాస్పిటల్‌లో పని చేసే ఉద్యోగి మరికొంత మందితో కలిసి అత్యాచారానికి పాల్పడడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళా రోగి మెడలోని మూడు తులాల బంగారు గొలుసు చోరీ కాగా పోలీసులు ల్యాబ్ టెక్నీషియన్‌ను పీఎస్‌కు తీసుకువెళ్లి లాఠీలతో కుళ్లబొడిచిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించగా జూనియర్ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ధర్నాకు దిగడంతోవైద్య సేవలకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో తరచుగా ఇలాంటి సంఘటనలో చోటు చేసుకుంటుండడంతో పేద రోగులు గవర్నమెంట్ హాస్పిటల్స్ రావడానికి జంకే పరిస్థితులు నెలకొన్నాయి.

సెక్యూరిటీ లోపం..

నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో సెక్యూరిటీ వ్యవస్థ లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేసే సెక్యూరిటీ సిబ్బంది రోగులు, వైద్యులు, సిబ్బంది భద్రత గురించి అంతగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కంట పడకుండా విలువైన వస్తువులు బయటకు తరలిస్తున్నారు.

తరచుగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగుల భద్రత గాలిలో దీపంగా మారింది. ముఖ్యంగా పెద్దాస్పత్రులలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. రోగులు, వారి సహాయకులకు చెందిన సెల్ ఫోన్లు, పర్సులు, ఆభరణాలు, నగదు ఇలా అనేక రకాలుగా దొంగతనాలు చోటు చేసుకుంటుండగా పోలీస్ స్టేషన్లకు చేరుతున్న సంఘటనలు మాత్రం స్వల్పంగా ఉంటున్నాయి.

చిన్న చిన్న దొంగతనాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే నమోదయ్యే కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలా కేవలం రోగులు, వారి సహాయకులే కాకుండా దొంగలు డాక్టర్లను సైతం వదలడం లేదు.

విలువైన వస్తువులే టార్గెట్..

ప్రభుత్వ ఆస్పత్రులలో విలువైన వస్తువులను సైతం దొంగలు వదలడం లేదు. ఏసీలు, ఇతర వైద్య పరికరాలు, మందులు తరచుగా దొంగతనానికి గురవుతున్నాయి. గతంలో ఉస్మానియా ఆస్పత్రిలో ఏసీ ఔటర్లు, కరెంటు మోటార్‌లు, ఇతర పరికరాలు దొంగతనానికి గురికావడంతో ఆస్పత్రి అధికారులు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. హాస్పిటల్స్‌లో సీసీ టీవీలు ఉన్నా కొన్ని సంఘటనలు వాటిల్లో నమోదుకాక పోవడంతో ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి...

ప్రభుత్వ ఆస్పత్రులలో ఏదైనా సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అనంతరం వాటి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారింది. ఉస్మానియా ఆస్పత్రిలో పని చేసే కొంత మంది సెక్యూరిటీ సిబ్బంది భద్రతను గాలికి వదలి తమకు ఆదాయం ఎలా వస్తుందనే విషయంపై దృష్టి సారిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను హాస్పిటల్‌లో డబ్బులు తీసుకుని పార్కింగ్ చేయించడం, రోగులకు సేవ పేరుతో వారి నుండి డబ్బులు డిమాండ్ చేయడం వంటివి చేస్తున్నారు. మామూళ్లు అధికంగా వచ్చే విభాగాల వద్ద డ్యూటీలు చేసేందుకు వారు ఆసక్తి చూపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది వస్తువులకు తగిన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story

Most Viewed