అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఏడాది పూర్తైనా వెలువడని ఉత్తర్వులు!

by Disha Web Desk 2 |
అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఏడాది పూర్తైనా వెలువడని ఉత్తర్వులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: “రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరినవారి వయసు అయిపోతున్నది. పర్మినెంట్ అవుతుందనే ఆశతో జాయిన్ అయ్యారు. అర్ధాకలితో పనిచేస్తున్నారు. వారిని వదిలేస్తే పాపం బజారున పడతారు. గత డిసెంబరు (2021)లో హైకోర్టు నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. ఈ వివాదం అయిపోతే పర్మినెంట్ చేద్దామనుకున్నాం. ఈ రోజు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. మొత్తం 11,103 కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాను” – 2022 మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన.

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా లక్ష్యం పూర్తి స్థాయిలో అమలుకాలేదు. రాష్ట్రంలోని ఖాళీ పోస్టుల భర్తీపై గతేడాది అసెంబ్లీ వేదికగానే క్లారిటీ ఇచ్చి వాటితో పాటే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే ప్రాసెస్ మొదలవుతుందని ఉద్యోగులు భావించారు. అన్ని డిపార్టుమెంట్ల నుంచి లెక్కలు తీసే పని కాస్త ఆలస్యంగానైనా మొదలైంది. చివరకు సుమారు 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నట్లు తేలింది. ఎక్కువగా ఇంటర్‌మీడియట్ బోర్డు, ఉన్నత విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖలోనే కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. పంచాయితీరాజ్ లాంటి కొన్ని డిపార్టుమెంట్లలో మాత్రమే దాదాపు వెయ్యి మంది వరకు రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన డిపార్టుమెంట్లలో ఆశించిన స్థాయిలో క్రమబద్ధీకరణ ప్రాసెస్ పూర్తికాలేదు.

రాష్ట్రంలో మొత్తం 91,142 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మినహా మిగిలిన 80,039 ఖాళీ పోస్టుల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని స్పష్టం చేశారు. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసినా అవి వివిధ దశల్లోనే ఉండిపోయాయి. ఏడాది కాలం దాటినా ఒక్క పోస్టు కూడా కొత్తగా భర్తీ కాలేదు. టీఎస్పీఎస్సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో తిరిగి ఎగ్జామ్స్ నిర్వహించడం ప్రహసనంగా మారింది. పలుమార్లు పరీక్షా తేదీలు వాయిదా పడుతూ ఉన్నాయి. ఎప్పుడు జరుగుతాయనేది అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది.

కాంట్రాక్టు ఉద్యోగులు అరకొర జీతాలతో అర్ధాకలితో అలమటిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడంతో ఆయన వేగానిక తగినట్లుగానే పర్మినెంట్ చేసే ప్రక్రియ తొందరగా పూర్తవుతుందని భావించారు. కానీ కొన్ని శాఖల్లో మాత్రమే జరిగి మెజారిటీ ఉద్యోగులుంటే మరికొన్ని శాఖల్లో ఊపందుకోకపోవడం వారికి నిరాశ కలిగిస్తున్నది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం మొదలు మంత్రులంతా రాజకీయాల్లో మునిగిపోయారని, ఉన్నతాధికారులు సైతం స్కీమ్‌ల అమలులో వేగం పెంచడంలో నిమగ్నమయ్యారని, ఈ పరిస్థితుల్లో రెగ్యులరైజేషన్ మీద దృష్టి సారించడంపై అనుమానాలు వ్యక్తం చేవారు. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే జరుగుతుందేమో అనే సందేహంలో పడ్డారు.

కొన్ని శాఖల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలు రెడీ అయ్యాయి. ఆర్థిక శాఖ ఆమోదం కోసం వెళ్ళాయి. ఆ జాబితాలో ఎవరెవరిని నిబంధనలు, ప్రమాణాల ప్రకారం రెగ్యులర్ చేయవచ్చో ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. హైకోర్టులో పిటిషన్ల లాంటి వివాదాలేవీ లేని కారణంగా వెంటవెంటనే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించి గాడిన పడతాయనే కాంట్రాక్టు ఉద్యోగులు భావించారు. కానీ వారి ఆశలు ఆడియాసలే అయ్యాయి. సీఎం లెక్కల ప్రకారం మొత్తం 11,103 మందిని రెగ్యులర్ చేస్తే వారికి పీఆర్సీ, డీఏ పెంపు తదితరాలన్నింటితో కలిపి ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ. 450 కోట్ల నుంచి రూ. 500 కోట్ల మేర ప్రతి నెలా భారం పడే అవకాశమున్నది. ఈ ప్రకారం సగటున ఏటా రూ. 6000 కోట్ల మేర ప్రభుత్వంపై నారం పడనున్నది.

రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు, ఆర్జించనున్న ఆదాయం, ఆర్థిక వనరుల సమీకరణ తదితరాలను దృష్టిలో పెట్టుకున్న ఆర్థిక శాఖ అధికారులు వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల విషయంలో ఆమోదం తెలపడంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఉనికిలోకి వచ్చిన స్కీమ్‌లకు నిధులను కేటాయించడం ఆర్థిక శాఖ అధికారులకు సవాలుగా మారింది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడం, రిజర్వుబ్యాంకు నుంచి అప్పులు పుట్టడంలో చిక్కులు ఎదురుకావడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే పడే అదనపు భారాన్ని మోయడం కొన్ని చిక్కులు తెచ్చే అవకాశమున్నది.

ఈ కారణంగానే అన్ని శాఖల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ప్రతిపాదనలు వచ్చినా ఆమోదం విషయంలో మాత్రం వెంటవెంటనే నిర్ణయం తీసుకోవడంలేదు. వైద్యారోగ్య శాఖలో నర్సులు చాలా మంది కాంట్రాక్టు పద్ధతిలోనే రిక్రూట్ అయ్యారు. వీరందరూ పర్మినెంట్ అవుతుందని ఆశించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉండిపోవడంతో ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేక, ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రానందున దిగమింగుకోలేక సతమతమవుతున్నారు. కళ్ళముందే సర్వీసు మొత్తం వృథా అయిపోతున్నదన్న ఆవేదన చెందడమే తప్ప డిమాండ్ చేసే అవకాశం లేకుండా పోయింది.


Next Story

Most Viewed