మే నెల రికార్డులు మార్చిలోనే బ్రేక్.. విద్యుత్ వినియోగం మరో రికార్డు

by Disha Web Desk 4 |
మే నెల రికార్డులు మార్చిలోనే బ్రేక్.. విద్యుత్ వినియోగం మరో రికార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గురువారం 79.48 మిలియన్ యూనిట్ల రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం నమోదయ్యింది. గతేడాది మే 19, 2023న 79.33 మిలియన్ యూనిట్ల వినియోగం రికార్డుగా వున్నది. గతేడాది మే నెలలో రికార్డయిన అత్యధిక వినియోగం ఈ ఏడాది మార్చిలో నమోదవ్వడం విశేషం. గతేడాది మార్చి నెలలో అత్యధిక విద్యుత్ వినియోగం 67.97 మిలియన్ యూనిట్లు మాత్రమే.

గతేడాది మార్చి నెల సరాసరి విద్యుత్ వినియోగం 57.84 మిలియన్ యూనిట్లు. ఈ ఏడాది మార్చ్ వరకు సరాసరి విద్యుత్ వినియోగం 70.96 మిలియన్ యూనిట్లు. దాదాపు 22.7 శాతం అధిక విద్యుత్ వినియోగం నమోదయ్యింది. ఈ ఎండా కాలంలో కావాల్సినంత కరెంటు అందుబాటులో వుండటం, నిరంతరాయ సరఫరా చేయడం వల్ల విద్యుత్ వినియోగం రోజుకు పెరుగుతోంది. ఈ సీజన్‌లో వినియోగం 90 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉంది. డిమాండ్ ఎంత పెరిగినా తట్టుకునేందుకు గాను అదనపు లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేశారు.

విద్యుత్ సరఫరాపై 24/7 పర్యవేక్షణ

సరఫరా తీరుపై ప్రతి రోజూ ఉదయం 8:30 గంటలకు అన్ని జోన్ల సర్కిళ్ల సీజీఎం, ఎస్ఈలతో సీఎండీ ముషారఫ్ ఫరూఖీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు విద్యుత్ డిమాండ్ - సరఫరా, విద్యుత్ అంతరాయాలు, సిబ్బంది హాజరు వంటి నివేదికలు పరిశీలించడం చేస్తున్నారు. దీనికి తోడు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ కార్యాలయాల బలోపేతం కోసం సీబీడీ, లైన్స్ వంటి ఇతర విభాగాలను ఏకీకరణ చేసి ఆపరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లకు భాద్యతలు అప్పగించారు. గ్రేటర్ పరిధిలోని 212 సెక్షన్ స్థాయి ఎఫ్ వోసీ ల్లో దాదాపు 800 మంది సిబ్బంది నిత్యం అందుబాటులో వుంటున్నారు. దీనికి తోడు పీక్ అవర్స్ ముగిసేవరకు ప్రతి రోజూ తొమ్మిది గంటల వరకు విధుల్లోనే అన్ని విభాగాల అధికారులు అందుబాటులో వుండాల్సిందిగా సీఎండీ ఆదేశించారు. వారానికి ఒకసారి సీజీఎం, ఎస్ఈలు విధిగా బస్తీల్లో కాలనీల్లో పర్యటించాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది విధుల్లో అనునిత్యం సంస్థ జాకెట్ ధరించి వుండటం, హెల్మెట్, గ్లోవ్స్ వంటివి విధిగా ఉపయోగించాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖి ఆదేశించారు.


Next Story

Most Viewed