MLC ఎన్నికల్లో కేసీఆర్‌కు షాకిచ్చిన టీచర్లు.. ఆ ప్రక్రియ మరింత ఆలస్యం చేయనున్న సర్కార్!

by Disha Web Desk 2 |
MLC ఎన్నికల్లో కేసీఆర్‌కు షాకిచ్చిన టీచర్లు.. ఆ ప్రక్రియ మరింత ఆలస్యం చేయనున్న సర్కార్!
X

రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ట్రాన్స్‌ఫర్స్ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆ ప్రక్రియ పూర్తియితేనే కొత్తగా ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే చాన్స్ ఉంటుంది. బదిలీల ప్రక్రియలో ఎదురైన పలు సమస్యలతో కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీన మరోసారి విచారించనున్నది. ఒక వేళ కోర్టు తుది తీర్పు వెలువరించినా అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి ఎదురైంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీచర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్లు పడవని, ఈ సమయంలో ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ చేపట్టిన ఉపయోగం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే బదిలీల విషయంలో కోర్టులో ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించలేకపోతున్నదని ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ పోస్టులు భర్తీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రమోషన్లు, బదిలీలు పెండింగ్‌లో ఉండటంతో వాటికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు. ఇవి క్లియర్ అయితేనే టీఆర్టీ నోటిఫికేషన్‌కు రూట్ క్లియర్ అవుతుంది. ఈ తతంగం ఇప్పట్లో పూర్తికాదని, కొత్త గవర్నమెంట్‌లోనే టీచర్ల ఉద్యోగాల భర్తీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసింది. స్పౌజ్ ఉపాధ్యాయులు, యూనియన్లలో పనిచేసే ఉపాధ్యాయులకు అదనపు పాయింట్స్ ఇవ్వడంపై కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై ఇప్పటికే రెండు మూడు సార్లు విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 3వ వారానికి వాయిదా వేసింది. ఆ రోజున కోర్టు కేసును విచారించి, వెంటనే తుది తీర్పు ఇచ్చినా పదోన్నతులు, బదిలీలు చేపట్టే అవకాశాలు చాలా తక్కువేనని అధికారుల అభిప్రాయం. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఆ టైమ్‌లో ప్రమోషన్లు, బదిలీలు చేపట్టడం కష్టమే.

క్లియర్ అయితేనే టీఆర్టీ

కొత్తగా టీచర్లును భర్తీ చేసేందుకు టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముందుగా టీచర్ల ట్రాన్స్‌ఫర్స్ పూర్తి చేయాలి. దాని తర్వాతే రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలి. దీని వల్ల ఖాళీల సంఖ్యపై మరింత స్పష్టత రావడంతో పాటు పాత టీచర్లు తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేస్తారు. అలా కాదని ట్రాన్స్‌ఫర్స్, బదిలీలకు ముందే నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వారిని రిక్రూట్ చేయడం వల్ల వారికి లోకల్‌గా పోస్టింగ్ వస్తుంది. కానీ, సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం పాత టీచర్లకు ఉండదు. దీని వల్ల వారి నుంచి వ్యతిరేకత వస్తుంది. అందుకే బదిలీలు చేపట్టకుండా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే టీచర్ల ఒప్పుకోరు. అందుకే ఉమ్మడి రాష్ట్రం నుంచే డీఎస్సీ నోటిఫికేషన్ ముందు ట్రాన్స్‌పర్స్ ప్రక్రియ చేపట్టడం అనవాయితీగా పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం బదిలీల అంశంపై కోర్టులో కేసు నడుస్తున్నది.

అన్ని కొత్త సర్కారులోనే

టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్, కొత్తగా రిక్రూట్‌మెంట్ ఇక కొత్త సర్కారులో చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నది అధికారుల వాదన. కోర్టులో ఉన్న కేసు క్లోజ్ కావాలి. అనంతరం పరిస్థితులు సెట్ అవ్వాలి. తర్వాత ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్‌కు రెండు నెలల సమయం తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇలా ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నది. అంతా సర్దుకునే‌లోపు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు వచ్చే చాన్స్ కూడా లేకపోలేదు.

నెగిటివ్ ఫీలింగ్

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండులక్షల మంది టీచర్లు ఉన్నారు. వీరంత ప్రభుత్వం‌పై నెగిటివ్‌గా ఉన్నట్టు అధికార పార్టీ అనుమానం వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్, హైదారబాద్, రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఎన్నికల ముందు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్స్ చేపట్టిన టీచర్ల ఓట్ల ద్వారా ప్రయోజనం పొందే చాన్స్ ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఎన్నికలు పూర్తయిన తర్వాతే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అందుకనే వేసవి సెలవుల్లో బదిలీలు పూర్తి చేసే చాన్స్ ఇవ్వాలని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించడం లేదని టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed