రాష్ట్ర ప్రభుత్వానికి ‘కోటి’ తిప్పలు.. ఆసక్తికరంగా మారిన ఆచరణ

by Disha Web Desk 2 |
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కోటి’ తిప్పలు.. ఆసక్తికరంగా మారిన ఆచరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ‘కోటి’ తిప్పలు వచ్చి పడ్డాయి. ఆరు గ్యారంటీలతో ఓటర్లలో భరోసా నింపిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టింది. ఈ గ్యారంటీల్లో కొన్ని స్కీములు కొత్తగా ప్రవేశపెడుతున్నవి కాగా మరికొన్ని గతంలోని ప్రభుత్వం అమలు చేసినవాటికి సాయాన్ని పెంచేవి. వీటి అమలుపై సీరియస్‌గా ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ‘కోటి’ స్టాండర్డ్ ప్రామాణికంగా మారింది. ఏ స్కీమ్ అమలు చేయాలన్నా లబ్ధిదారుల సంఖ్య కొంచె అటూ ఇటుగా ‘కోటి’గా ఉంటున్నది. ఆరు నూరైనా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసే తీరుతామని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా స్పష్టమైన ప్రకటనలు చేశారు. ఈ ‘కోటి’ విషయంలో ప్రభుత్వ ఆచరణ ఆసక్తికరంగా మారింది. ఈ హామీ అమలుకు అనుగుణంగానే కొత్త బడ్జెట్ కసరత్తు జరుగుతున్నది.

దాదాపు అన్ని స్కీములకూ అంతే..

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన ప్రోగ్రామ్‌లో ‘అభయహస్తం’ వచ్చిన దరఖాస్తుల సంఖ్య కోటి దాటింది (1.05 కోట్లు). రాష్ట్రంలో ఇప్పటికే వైట్ రేషను కార్డుల సంఖ్య దాదాపు 90 లక్షలు ఉంటే కొత్తవాటికి కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 12 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అర్హమైనవాటికి క్లియరెన్స్ వస్తే కోటి దాటుతుంది. గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చే కనెక్షన్లు (లబ్ధిదారులు) కోటికి పైగానే ఉన్నాయి. మహిళలకు ప్రతి నెలా రూ.2500 చొప్పున ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య కూడా దాదాపు కోటికి దగ్గరగా ఉన్నది. రైతుబంధు అందుకుంటున్నవారికి అదనంగా రైతుభరోసా కింద కౌలు రైతులు, రైతు కూలీలు కూడా లబ్ధిదారులుగా చేరుతుండడంతో ఈ సంఖ్య కూడా కోటి అవుతోంది. అభయహస్తం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఐదు గ్యారంటీలను ప్రభుత్వం పేర్కొనడంతో ఇందులో కొన్నింటికి దాదాపు కోటి మంది (అంచనాగా) చొప్పున అప్లై చేసుకున్నారు. ఆయా గ్యారంటీలకు రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన లబ్ధిదారుల సంఖ్య అప్లికేషన్ల స్క్రూటినీ సందర్భంగా వెల్లడి కానున్నది. ఈ నెల 30వ తేదీకల్లా డాటా ప్రాసెసింగ్‌ను కంప్లీట్ చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నందున అప్పటికి స్పష్టత రానున్నది.

కోడ్ రాకముందే అమలుకు సన్నాహాలు..

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి నెల ఫస్ట్ వీక్‌లో రావచ్చని అంచనా. ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తున్నందున అప్పటికల్లా గ్యారంటీల అమలు జీవోలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీలైనంత తొందరగా రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, ‘గృహజ్యోతి’ ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ‘మహాలక్ష్మి’ స్కీమ్‌లో నెలకు రూ.2500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం, ప్రస్తుతం అమలవుతున్న ‘ఆసరా’ స్థానంలో ‘చేయూత’ను అమలు చేయాలనుకుంటున్నది. ఇప్పటికే విద్యుత్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయం, ఫైనాన్స్ డిపార్టుమెంట్ల అధికారులతో ప్రాథమిక సమావేశాలు జరిపిన మంత్రులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూపొందించే బడ్జెట్‌లో దేనికెంత కేటాయింపు చేయాలనే అంశంపై సమీక్ష చేశారు. మార్గదర్శకాలు రూపొందిన తర్వాత ఏ స్కీమ్ కింద ఎంత మంది లబ్ధి పొందుతారనేది స్పష్టం కానున్నది.

గణనీయంగా పెరిగిన సంఖ్య..

ప్రస్తుతం ఆసరా పింఛన్లు అందుకుంటున్నవారు సుమారు 44.12 లక్షలు. దీనికి ‘మహాలక్ష్మి’, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కలుపుకుంటే లబ్ధిదారుల సంఖ్య కోటి దాటుతుంది. ప్రస్తుతం రైతుబంధు అందుకుంటున్నవారు 66 లక్షల మంది ఉంటే కౌలురైతులు, రైతుకూలీలను కలుపుకుంటే ఆ సంఖ్య కూడా కోటి దాటుతుంది. సాగు విస్తీర్ణంలో తేడాలు లేకపోయినా లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. కౌలు రైతులకు, రైతు కూలీలకూ రైతుభరోసా స్కీమ్ కింద వీరికి కూడా సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో అభయహస్తం దరఖాస్తులు గణనీయంగా వచ్చాయి.






Next Story

Most Viewed