దానం నాగేందర్‌ ‘అనర్హత’ పిటిషనర్‌కు హైకోర్ట్ ఝలక్

by Disha Web Desk |
దానం నాగేందర్‌ ‘అనర్హత’ పిటిషనర్‌కు హైకోర్ట్ ఝలక్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ బీ ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా బరిలో దిగుతున్న ఖైరాతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. తన స్వార్థం కోసం దానం నాగేందర్ పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఎమ్మెల్యేగా కొనసాగుతూనే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు. ఈ కారణంగా దానం నాగేందర్‌పై అనర్హత వేసేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు.

అయితే ఈ వాదనలు విన్న న్యాయమూర్తి భిన్నంగా స్పందించారు. అనర్హత వేటు వేయాలని బీ ఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అడగకుండా ఓటు వేసిన మీరెందుకు అడుగుతున్నారని పిటిషన్ వేసిన రాజు యాదవ్‌ను ప్రశ్నించారు. దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీఫాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి అభ్యంతరం ఉండాలి కానీ ఓటర్‌గా ఉండి మీరు పిటిషన్ వెయ్యడమేంటన్న హైకోర్టు ప్రశ్నించింది. అనర్హత వేయాలని తాము అసెంబ్లీ స్పీకర్‌కు ఎలాంటి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

కాగా, రాజు యాదవ్ ఖైరతాబాద్ కాంగ్రెస్ లీడర్‌గా కొనసాగుతున్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి రావడం.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకే మళ్లీ సికింద్రబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో పిటిషన్ వేశారు. దానం నాగేందర్ చరిష్మా ఉందని కాంగ్రెస్ భ్రమపడుతుందని, పార్టీలో ఆయనకు మంచి కేడర్ ఉన్న నాయకులు ఉన్నారని దానంకు వ్యతిరేకిస్తున్నారు ఖైరతాబాద్ కాంగ్రెస్ లీడర్స్. దానం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటున్నారు. ఎంపీగా గెలిచి మళ్లీ ఆయన పార్టీ మారడన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు.


Next Story