పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేత అదిరిపోయే స్టెప్పులు.. నాగార్జునను దింపేశాడుగా..

by Disha Web Desk 4 |
పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేత అదిరిపోయే స్టెప్పులు.. నాగార్జునను దింపేశాడుగా..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/వెబ్‌డెస్క్ : భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ్‌పూర్ జ‌డ్పీటీసీ గుడాల అరుణ భ‌ర్త శ్రీనివాస్ సోమ‌వారం ఉద‌యం పోలీస్ స్టేష‌న్‌లో డ్యాన్సులు చేసిన వీడియో వైర‌ల్‌గా మారుతోంది. నాగార్జున నటించిన ‘నేనున్నాను’ సినిమాలోని ‘నన్నేలు మ‌న్మధుడా’ అనే పాట‌కు పోలీస్ స్టేష‌న్లోనే డ్యాన్సులు చేస్తుండ‌గా, స్టేష‌న్‌లోని కానిస్టేబుళ్లు ఎంక‌రేజ్ చేస్తున్న వీడియో నెట్టింట్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పోలీస్ స్టేష‌న్‌ను డ్యాన్స్ క్లబ్‌గా మార్చారంటూ నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై పోలీస్‌శాఖ కూడా తీవ్రంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా శ్రీనివాస్ ఉద‌యం వాకింగ్ వెళ్లి వ‌స్తూ నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అక్కడ ఉన్న కానిస్టేబుళ్లను ప‌ల‌క‌రించిన‌ట్లు సమాచారం.

ఇటీవ‌ల శ్రీనివాస్ డ్యాన్స్ చేసిన సంఘ‌ట‌న‌ను ఉదాహ‌రిస్తూ మీరు చాలా బాగా చేస్తారంటూ చెప్పడంతో పాటు ఓ పాట‌ను కానిస్టేబుల్ మొబైల్‌లో ప్లే చేయ‌డంతో డ్యాన్స్ షురు చేశాడు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో పోలీసుల తీరు.. జ‌డ్పీటీసీ భ‌ర్తపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విష‌యంపై శ్రీనివాస్‌ను దిశ వివ‌ర‌ణ కోర‌గా.. డ్యాన్స్ కూడా ఒక ఎక్ససైజ్ అంటూ చెబుతూ చ‌నువుగా ఉండే కానిస్టేబుళ్లకు చూప‌డం జ‌రిగింద‌న్నారు. ఆ వీడియోను కూడా త‌న‌తో ఉన్నవాళ్లే తీశార‌ని, వేరే ఉద్దేశంతో చేసింది కాద‌ని వివ‌రించారు. అయితే తానే ఒక గ్రూపులో పోస్టు చేయ‌గా, దీనిని రాద్ధాంతం చేసే ప్రయ‌త్నం చేస్తున్నారంటూ స‌మ‌ర్థించుకున్నారు.


Next Story