100 కార్లతో భారీ కాన్వాయ్.. రంగంలోకి దిగేందుకు సర్వం సిద్ధమైన కేసీఆర్..!

by Disha Web Desk 19 |
100 కార్లతో భారీ కాన్వాయ్.. రంగంలోకి దిగేందుకు సర్వం సిద్ధమైన కేసీఆర్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 24 నుంచి రోడ్‌షోలు ప్రారంభిస్తున్నారు. అందుకు భారీ కాన్వాయి సిద్ధం చేస్తున్నారు. సుమారు వంద వాహనాలతో తరలివెళ్తున్నారు. యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులు, గజ్వేల్ నుంచి కూడా ముఖ్య నేతలు సైతం కేసీఆర్ వెంట వెళ్లనున్నారు. పార్టీ అధినేతకు రోడ్‌షోలో ఇబ్బందులు కలుగకుండా పార్టీ యువనేతలే వలంటీర్లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఆకాల వర్షాలతో పంటనష్టం జరిగినా, అత్యవసర పరిస్థితులను బట్టి రోడ్ షో రూట్ మ్యాప్‌ను ఛేంజ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రోడ్డు షో 17 రోజులపాటు కొనసాగనున్నది.

17 రోజులు యాత్ర

బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఇక హోరెత్తించనుంది. ఈ నెల 24 నుంచి పార్టీ అధినేత కేసీఆర్ రోడ్డుషో ప్రారంభమవుతుంది. అందుకు పార్టీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రోడ్డుమ్యాప్‌ను సిద్ధం చేశారు. మార్చి 10 వరకు మొత్తం 17 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అయితే కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సుకు పూజలు చేసి స్టార్ట్ కానున్నారు. మిర్యాలగూడకు చేరుకొని సాయంత్రం 5.30 గంటలకు రోడ్డుషోను ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ వెంట 100 వాహనాల్లో యువత, విద్యార్థి, పార్టీ నాయకులు తరలినున్నారు.

యాత్ర ముగిసే వరకు వాహన శ్రేణి కేసీఆర్ వెన్నంటి ఉంటారు. 17 పార్లమెంటు సెగ్మెంట్లలో ఈ కాన్వాయి ప్రచారంలో పాల్గొంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 5 నుంచి 10 వాహనాల్లో విద్యార్థి నాయకులు తరలివెళ్తున్నారు. ఒక్కో వాహనంలో ఐదుగురు ఉంటారని సమాచారం. పార్టీ నాయకులు సైతం ఒక్కొక్కరు 10కిపైగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు సైతం కేసీఆర్ వెంట రోడ్డుషోలో పాల్గొంటారని సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు బసకు సంబంధించిన ఏర్పాట్లపైనా పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.

100 మందికి పైగా వలంటీర్లు

కేసీఆర్ రోడ్డు షోలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పార్టీ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కేసీఆర్ ప్రధానప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సెక్యూరిటీ తక్కువగా ఉంది. నల్లగొండ, కరీంనగర్‌లో ఎండిన పంటపొలాల సందర్శకు వెళ్లినప్పుడు, సంగారెడ్డి సభల సమయంలోనూ జనం వచ్చి మీదపడకుండా అడ్డుకునేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేశారు. అయితే వారితో ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించిన పార్టీ చురుకైన పార్టీ యువనేతలను వలంటీర్లుగా వినియోగించుకోవాలని భావిస్తుంది. అందుకు 100 మందికి పైగా కేసీఆర్ రోడ్డు షో సమయంలో బస్సు చుట్టూ ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఎక్స్ ఆర్మీకి చెందిన వారు 50 మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపడుతోంది.

అత్యవసర పరిస్థితిని బట్టి రూట్ ఛేంజ్!

రూట్ మ్యాప్ ప్రకారం కేసీఆర్ రోడ్డుషో కొనసాగుతుంది. అన్ని నియోజకవర్గాలను కలుపుతూ 17 రోజులపాటు కొనసాగనుంది. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉంటుందో.. కేడర్ నైరాశ్యంలో ఉంటుందో అక్కడ జోష్ నింపేందుకు, కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు రోడ్డు షో కొనసాగనుంది. అయితే ప్రస్తుతం అకాల వర్షాలు వస్తున్న తరుణంలో పంటనష్టం, తోటల నష్టం జరిగితే వాటి పరిశీలన కోసం రూట్ మ్యాప్ ఛేంజ్ అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రూట్ మ్యాప్ ప్రకారం ఉదయం రైతాంగ సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటన చేయనున్నారు. ఎండిన పంటపొలాల పరిశీలన, ధాన్యం కల్లాల సందర్శన, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం నిర్వహించనున్న రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొననున్నారు. అత్యవసరం అయితే రూట్ ఛేంజ్ చేయనున్నట్లు సమాచారం.

ప్రభుత్వ సెక్యూరిటీ లేదు.. మీరే అండగా ఉండాలి

కేసీఆర్ చేపట్టే రోడ్డు షోలో విద్యార్థి నాయకులు, నాయకులు అనుసరించాల్సిన వ్యూహాలపైనా సోమవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. విద్యార్థి నాయకులు, యువ నేతల సేవలను రోడ్డుషోలో వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. కేసీఆర్‌కు విధేయుడిగా ప్రతి ఒక్కరు పనిచేయాలని, ప్రజలు దూసుకురాకుండా అడ్డుకోవాలని, జెండా పట్టుకోవాలని సూచించారు. ప్రతి కారుకు పాసులు ఇస్తామని, ఐడీ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. రోడ్డు షో పూర్తయ్యేవరకు కేసీఆర్ వెంటే ఉండాలని, ప్రభుత్వ సెక్యూరిటీ లేదు.. మీరే అండగా ఉండాలని కోరారు. సిద్దిపేట, మేడ్చల్, గజ్వేల్, సిరిసిల్ల నుంచి కూడా నేతలు రోడ్డు షోలో పాల్గొంటారని సూచించినట్లు తెలిసింది.



Next Story

Most Viewed