బాసర ట్రిపుల్ ఐటీ‌లో మళ్లీ ఉద్రిక్తత

by Disha Web Desk 4 |
బాసర ట్రిపుల్ ఐటీ‌లో మళ్లీ ఉద్రిక్తత
X

దిశ ప్రతినిధి నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీ‌లో ఆదివారం అర్ధరాత్రి బయటపడిన భాను ప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య వ్యవహారం ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి భాను ప్రసాద్ పీయుసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐటీ మంత్రి కేటీఆర్ బాసరకు వచ్చి పక్షం రోజులు గడవకముందే ట్రిపుల్ ఐటీ‌లో ఆత్మహత్య ఘటన జరగడం అధికార వర్గాలను కూడా కలవరానికి గురిచేసింది. ఆత్మహత్య చేసుకున్న భానుప్రసాద్ సూసైడ్ లేఖను బయటపెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై యూనివర్సిటీ యంత్రాంగం ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రులు సంయమనం పాటించాలని మాత్రమే వైస్ ఛాన్స్‌లర్ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.


దీనిపై విద్యార్థులు మృతుడు భాను ప్రసాద్ తల్లిదండ్రులతో పాటు ఇక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి చెందడం లేదు. విద్యార్థులు సోమవారం తమ తరగతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల క్రితమే భాను ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఒక హాస్టల్ గదిలో ఉరేసుకుని భాను ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషయం యూనివర్సిటీ యంత్రాంగానికి తెలియకపోవడంపై విద్యార్థి వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డెడ్ బాడీ దుర్వాసన వచ్చే వరకు భాను ప్రసాద్ ఆచూకీ‌పై యాజమాన్యం పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తం అవుతుంది. అయితే విద్యార్థుల ఆందోళన ఏమి జరగడం లేదని ట్రిపుల్ ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి. తరగతులు సజావుగా జరుగుతున్నాయని కూడా తెలిపారు. సూసైడ్ నోట్ బయట పెట్టకపోవడం పై మాత్రమే విద్యార్థుల్లో నిరసన వ్యక్తం అవుతుంది. అయితే భాను ప్రసాద్ మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడని తాను చదవలేక పోతున్నానని సూసైడ్ లేఖలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మృతిపై లోతుగా విచారణ జరిగితే గాని అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు.

Next Story

Most Viewed